ఎట్ట‌కేల‌కు.. చింత‌మ‌నేనికే బీ-ఫాం!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పేరు చెప్ప‌గానే గుర్తుకు వ‌చ్చే పేరు ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. దెందులూరు జ‌న‌ర‌ల్ స్తానం నుంచి 2014లో విజ‌యం ద‌క్కించుకున్న ప్ర‌భాక‌ర్‌.. మాట కు మాట అనేసే టైపు. త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంది? అనేది ఎప్పుడూ ప‌ట్టించుకోరు. వివాదాలు ఆయ‌న ఇంటి గుమ్మానికి తోర‌ణాల‌ని అంటారు తెలిసిన వారు. ఇక‌, విభేదాలు.. ఆయ‌న గుమ్మం ముందు తిష్ట‌వేసుకుని కూర్చుంటాయి. ఏదేమైనా.. ప్ర‌జ‌ల్లో ఉంటూ.. వారి నాయ‌కుడిగా మాత్రం గుర్తింపు పొందారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎదుర్కొన‌ని పెద్ద సంక‌ట స్థితి ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంది. గ‌త ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడిన చింత‌మ‌నేని.. అనేక కేసులు పెట్టించుకున్నారు. కేవ‌లం జ‌గ‌న్ ప్ర‌బుత్వం లోనే ఆయ‌న‌పై 62 కేసులు న‌మోద‌య్యాయంటే ఆయ‌న ఏ రేంజ్‌లో జ‌గ‌న్ స‌ర్కారుపై పోరాటం చేశారో అర్ధ‌మ‌వుతుంది. ఇలాంటి నాయ‌కుడికి టికెట్ ఇచ్చే విష‌యంలో చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాలు.. అటు చింత‌మ‌నేని అభిమానుల‌ను, ఇటు దెందులూరు ప్ర‌జ‌ల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.

ముందు అస‌లు టికెట్ ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌చారంజ‌రిగింది. చింత‌మ‌నేనికి బ‌దులుగా ఆయ‌న కుమార్తె పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం చేశారు. దీంతో ప్ర‌భాక‌ర్ షాక్‌కు గుర‌య్యారు. ఇంత‌లోనే అస‌లు ఈ సీటును బీజేపీ కోరుతోంద‌న్నారు. ఇలా.. నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఎన్నిక‌ల వేళ‌.. అంద‌రికీ నామినేష‌న్ల ప‌త్రాలు.. బీఫాంలు ఇచ్చేసిన చింత‌మ‌నేనికి మాత్రం ఇవ్వ‌లేదు. దీంతో అస‌లు ఆయ‌న పోటీలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనే సందేహాలు వ‌చ్చాయి.

చింత‌మ‌నేని కి టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఆత్మ‌హ‌త్య‌లు త‌ప్ప‌వంటూ ఆయ‌న అనుచ‌రులు కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు గురువారం నామినేష‌న్ల ప‌ర్వం ముగుస్తుండ‌గా.. బుధ‌వారం చింత‌మ‌నేనికి చంద్ర‌బాబు బీఫాం ఇచ్చారు. దీంతో దెందులూరులో సీట్ పై జరిగిన ప్రచారాలకు ఎట్టకేలకు తెర పడింది. కూటమి తరపున దెందులూరు టిడిపి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ కు నారా చంద్రబాబు బీఫాం ఇచ్చారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిసిన చింతమనేని బీ-ఫాం అందుకున్నారు.