అన్నాడీఎంకేలో పెరిగిపోతున్న ‘చిన్నమ్మ’ టెన్షన్

తమిళనాడు షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అధికార ఏఐఏడీఎంకేలో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని శశికళ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చిన్నమ్మ నుండి పార్టీని రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళద్దరి మధ్య పెరిగిపోతున్న ఆధిపత్య గొడవల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలు దిక్కులు చూస్తున్నారు.

ఈనెల 24వ తేదీన అంటే బుధవారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి. అమ్మ జయంతిని ఘనంగా జరిపేందుకు రెండు వర్గాలు ఎవరికి వాళ్ళే భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జయలలిత నామస్మరణను పెంచేస్తున్న విషయం అర్ధమైపోతోంది.

నిజానికి శశికళకు ఏఐఏడీఎంకేకు ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు నాలుగు సంవత్సరాల జైలుశిక్షను విధించగానే ఆమెను బహిష్కరించినట్లు పార్టీ ప్రకటించింది. అంటే ఆమెకు టెక్నికల్ గా పార్టీకి సంబంధం లేదని అర్ధమైపోతోంది. అయితే జైలు నుండి విడుదలవ్వగానే ఏఐఏడీఎంకే పార్టీ తనదే అంటు శశికళ విచిత్రమైన ప్రకటన చేశారు. దాంతో పార్టీలో గందరగోళం మొదలైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరిలోను నమ్మకంలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి కానీ లేదా మాజీ సీఎం పన్నీర్ శెల్వంకు కానీ పార్టీని అధికారంలోకి తెచ్చేంత సీన్ లేదు. ఈ స్ధితిలో శశికళ పైనే నమ్మకం పెట్టుకున్న నేతలు కొందరు అధికారపార్టీలో ఉన్నారు. అలాంటి వారంతా పరోక్షంగా చిన్నమ్మకు సహకారం అందిస్తున్నారు.

ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో అధికారపార్టీకి ఎన్నికల్లో సారధ్యం వహించేదెవరనే విషయంలో మామూలు జనాలకు కూడా ఆసక్తిగా మారింది. నిజానికి శశికళకు జనాల్లో ప్రత్యేకంగా పాపులారిటి అంటు ఏమీ లేదనే చెప్పాలి. జయలలిత పక్కనే ఉండటం వల్ల చిన్నమ్మకు కూడా ప్రచారం వచ్చిందంతే.

చనిపోయేంతవరకు జయలలితే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె పక్కనే ఉన్న కారణంగా చిన్నమ్మకు పార్టీతో పాటు ప్రభుత్వంపై ఆధిపత్యం దక్కిందంతే. దీంతోనే తాను కూడా జయలలిత లాగ సూపర్ పవర్ అన్న భ్రమలోకి శశికళ వెళ్ళిపోయారు. ఇదే ఇపుడు అధికారపార్టీకి అనేక సమస్యలు తెస్తోంది. మరి జయలలిత జయంతి రోజున ఆమె ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది పార్టీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.