మంగళగిరిలో లావణ్యకు సీన్ అర్దమైపోయిందా

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంకోసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు నారా లోకేష్.

అయితే, ఈసారి మాత్రం, ఓటర్లు పూర్తి స్థాయిలో నారా లోకేష్‌కి మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాక ముందు వరకు, రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు పర్యటనలు నిర్వహించారు నారా లోకేష్. కోడ్ అమల్లోకి వచ్చాక మాత్రం, పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు.
మంగళగిరిలో ప్రతి గడపకూ వెళుతున్న నారా లోకేష్, ఎన్నికల ప్రచారాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ‘గత ఎన్నికల్లో ఓడిపోయాడు.. ఈసారి గెలవాలి..’ అనే సెంటిమెంట్ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌కి ఈసారి కలిసొచ్చేలా వుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి పోటీ చేయడంలేదు. ఆయన వైసీపీ మీద నానా రకాల విమర్శలూ చేసి, వైసీపీని వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరి, తిరిగి వైసీపీలో చేరారు. తిట్టిన నోటితోనే వైసీపీని పొగడుతూ, నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన విలువ తానే తీసుకున్నారు. అదే సమయంలో వైసీపీకి కూడా విలువ లేకుండా పోయింది.

వైసీపీ అభ్యర్థి విషయంలోనూ వైసీపీ అధినాయకత్వం కిందా మీదా పడింది.. చివరికి మురుగుడు లావణ్యను అభ్యర్థిగా వైసీపీ దించింది. కానీ, ఏం లాభం.? ప్రచారంలో ఆమె బాగా వెనకబడిపోయారు. టీడీపీ మీద రాజకీయ విమర్శలతో సరిపెడుతున్నారామె.

మరోపక్క, నారా లోకేష్ మాత్రం, నియోజకవర్గంలో గల్లీ గల్లీకి తిరుగుతున్నారు.. గడప గపడకీ వెళుతున్నారు. ఇదంతా గెలవడం కోసం మాత్రమే కాదు, రికార్డు మెజార్టీ కొట్టడానికి కూడా.. అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. తాజా సర్వేల ప్రకారం, మంగళగిరిలో నారా లోకేష్‌కి రికార్డు మెజార్టీ లోడింగ్.. అని తెలుస్తోంది.