నిమిషాల్లో హ‌రీష్ రావు కు రేవంత్ కౌంటర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీష్ రావు.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌టైర్లు పేల్చారు. “హ‌రీష్ రావు రాసింది రాజీనామా కాదు.. సీస‌ప‌ద్యం” అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. గ‌న్ పార్కు వ‌ద్ద హ‌రీష్‌రావు.. త‌న రాజీనామా ప‌త్రాన్ని మీడియాకు వెల్ల‌డించడాన్ని రేవంత్ త‌ప్పుబ‌ట్టారు. “సీస ప‌ద్యం రాసుకొచ్చి.. మీడియా ముందు వ‌దిలిండు. ఇక‌, దీన్ని.. ఎన్నిక‌ల్ల ప్ర‌చారం చేస్తుండు” అని వ్యాఖ్యానించారు.

రాజీనామా ఎలా చేయాలో ఆ మాత్రం హ‌రీష్‌రావుకు తెలియ‌దా? అని రేవంత్ అన్నారు. స్పీక‌ర్ ఫార్మాట్ లో ఒక్క అక్ష‌రం కూడా త‌ప్పులేకుండా.. సొద లేకుండా సోది లేకుండా రాయేల‌! కానీ, హ‌రీష్ మాత్రం సీస ప‌ద్యం లెక్క రాసుకొచ్చిండు. దీన్ని రాజీనామా అంటుండు. వినోటోళ్లుంటే ఇంకేమైనా కూడా చెబుత‌డు! అని అన్నారు. వ‌చ్చే ఆగ‌స్టు 15వ తేదీలోగా.. రుణ‌మాఫీ చేసేందుకు క‌ట్ట‌బడి ఉన్నామ‌ని రేవంత్ చెప్పారు. అందుకే త‌మ‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చార‌ని వ్యాఖ్యానించారు.

“రుణ‌మాఫీ చేయ‌న‌ప్పుడు.. ఇంక మాకు అధికారం ఇచ్చి ఏం ప్ర‌యోజ‌నం?” అని రేవంత్ సంచ‌ల‌న వ్యా ఖ్యలు చేశారు. 2 ల‌క్ష‌ల లోపు అప్పులు ఉన్న రైతుల జాబితాల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని.. అంద‌రికీ ఒకే విడ‌త‌లో రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని చెప్పారు. ఆరు నూరైనా ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు రూ.2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేస్తామ‌న్నారు. “అరుకోన్రి, గింజుకోన్రి.. త‌ల‌కింద‌లు త‌ప‌స్సు చెయ్య‌ని.. వాళ్ల‌కు ద‌క్కేది ఒక‌టో రెండో..” అని కేసీఆర్‌ను ఉద్దేశించి పార్ల‌మెంటు సీట్ల విజ‌యంపై తేల్చి చెప్పారు. కాంగ్రెస్ 14-15 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌న్నారు.