వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. వారిలో చాలామంది అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వారిలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నది రెండేళ్లుగా డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డినే. ఈయనపై చర్యలు చేపట్టాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ఆదివారం నాడు రాజేంద్రనాథ్‌ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక్క రోజు వ్యవధలోనే కొత్త డీజీపీ నియామకం కూడా జరిగిపోయింది. ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు (ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తాల పేర్లను సిఫారసు చేయగా.. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎన్నికల సంఘం డీజీపీగా ఖరారు చేసింది.

కాగా ఇదే సమయంలో అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి మీద ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన మీద ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇలా గత మూడు వారాల్లో చాలామంది వివాదాస్పద అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇక ప్రతిపక్షాలు కోరుకుంటున్న బదిలీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిదే. ఆయన మీద కూడా అనేక ఆరోపణలున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన మీద కూడా వేటు పడితే ఎన్డీయే కూటమి ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్లొచ్చు.