30 వసంతాల ‘హలో బ్రదర్’ చమక్కులు

స్టార్ హీరోలు కామెడీ క్లాసిక్స్ చేస్తే ఆ కిక్కే వేరు. అలాంటి వాటిలో హలో బ్రదర్ స్థానం ప్రత్యేకం. ఈ రోజుతో 30 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ చమక్కులు కొన్ని చూద్దాం. వారసుడుతో తనకో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ తీసుకొచ్చిన కథను విని కెరీర్ లో మొదటిసారి డ్యూయల్ రోల్ చేసేందుకు నాగార్జున ఒప్పుకున్నాడు. కవలలకు ఒకే రియాక్షన్లు అనే పాయింట్ జాకీ చాన్ మూవీ ట్విన్ డ్రాగన్స్ నుంచి తీసుకున్నప్పటికీ ఫక్తు తెలుగు కమర్షియల్ మీటర్ లో అదిరిపోయే హాస్యం, నవ్వుల పంటతో పాటు మాస్ మసాలా భోజనం వడ్డించారు హలో బ్రదర్ టీమ్.

ఈ సినిమాకు నటుడు కం రైటర్ ఎల్బి శ్రీరామ్ పేలిపోయే సంభాషణలు రాశారు. నాగ్ తో పాటు రమ్యకృష్ణ, గిరిబాబు, బాబుమోహన్ , బ్రహ్మానందంకు కుదిరిన డైలాగులు థియేటర్లను ఘొల్లుమనేలా చేశాయి. రాజ్ కోటి స్వరపరిచిన ఆరు పాటలు క్లాసు, మాస్ రెండు వర్గాలు పదే పదే వినేలా అద్భుతంగా కుదిరాయి. తమిళ నటుడు నెపోలియన్ ని విలన్ గా తీసుకొచ్చి సెకండ్ హాఫ్ మొత్తం చినిగిపోయిన బట్టలతో క్యారెక్టర్ ని డిజైన్ చేయడం విభిన్నమైన ప్రయోగం. ఎబ్బెట్టుగా అనిపించలేదు సరికదా స్క్రీన్ మీద పేలింది. రెండు విభిన్న స్లాంగ్స్ తో నాగార్జున చూపించిన మ్యానరిజమ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి.

కమర్షియల్ గానూ హలో బ్రదర్ భారీ విజయం నమోదు చేసుకుంది. తక్కువ గ్యాప్ లో బాలకృష్ణ భైరవ ద్వీపం, యమలీలతో పోటీ పడాల్సి వచ్చినా వసూళ్ల పరంగా అప్పటిదాకా యువ సామ్రాట్ కెరీర్ బెస్ట్ నమోదు చేసుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్ ఇలా మూడు విభాగాల్లో నంది అవార్డులు సొంతం చేసుకుంది. 1994 ఏప్రిల్ 20 హలో బ్రదర్ రిలీజైతే 1997లో సేమ్ టైటిల్ తో సల్మాన్ ఖాన్ హిందీలో, అదే సంవత్సరం రవిచంద్రన్ కన్నడలో రీమేక్ చేసుకుని హిట్లు కొట్టారు. ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపించే ఈ పైసా వసూల్ ఎంటర్ టైనర్ కు కాలదోషం ఉండదు.