టాలీవుడ్లో మ‌రో హై ప్రొఫైల్ డెబ్యూ డైరెక్ట‌ర్‌

Art Director Mahinder

డైరెక్ట‌ర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్‌.. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావే కాదు.. చాలామంది దిగ్గ‌జాలు చెప్పే మాటే ఇది. సినిమాకు సంబంధించి అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి ద‌ర్శ‌కుడే అనే విష‌యంలో మ‌రో మాట లేదు. అందుకే మిగ‌తా 23 విభాగాల‌కు చెందిన వాళ్లు కూడా వీలుంటే ద‌ర్శ‌క‌త్వం చేసేద్దామ‌ని చూస్తుంటారు.

ఆ కోరిక‌ను నెర‌వేర్చుకున్న‌ వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐతే ప్రొడ‌క్ష‌న్ డిజైన్ నుంచి ద‌ర్శ‌క‌త్వంలోకి మారిన వాళ్లు పెద్ద‌గా క‌నిపించ‌రు. ఈ జాబితాలో చేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట ఓ టాప్ ఆర్ట్ డైరెక్ట‌ర్. అత‌నే.. ర‌వీంద‌ర్. ఛ‌త్ర‌ప‌తి, మ‌గ‌ధీర‌, ఈగ‌, నాన్న‌కు ప్రేమ‌తో లాంటి భారీ చిత్రాల‌కు అత‌ను క‌ళా ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న మెగా మూవీ రాధేశ్యామ్‌కు అత‌నే ఆర్ట్ డైరెక్ట‌ర్.

రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ వాళ్లే ర‌వీంద‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రాధశ్యామ్ చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా యువి అధినేత‌ల్ని ఇంప్రెస్ చేసిన ర‌వీంద‌ర్.. ఓ క‌థ చెప్పి వారితో ఓకే చేయించుకున్నాడ‌ట‌. ఇది ఓ టెక్నిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అంటున్నారు. ఇంకా హీరో, ఇత‌ర వివ‌రాలేమీ వెల్ల‌డి కాలేదు.

కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేయ‌డంలో యువి వాళ్ల‌కు మంచి పేరుంది. కొర‌టాల శివ‌, సుజీత్, రాధాకృష్ణ‌కుమార్ లాంటి ద‌ర్శ‌కులను ఈ సంస్థే ప‌రిచ‌యం చేసింది. మ‌రి వీరి కోవ‌లోనే ర‌వీంద‌ర్ కూడా త‌న‌దైన ముద్ర వేసి ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతాడేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.