ఉచిత వైద్యశిబిరం వెనుక మరీ ఇంత నీచమైన వ్యాపారమా?

చూసినంతనే.. ఎంత చక్కటి మనసు. ఇలాంటి వారు పది మంది ఉంటే చాలు.. చుట్టుపక్కల పరిస్థితులు మారిపోతాయి. ఇలాంటోళ్లు ఊరికి కొందరు ఉంటే ఊరు మొత్తం మారిపోతుందన్న మాటలు వినిపిస్తాయి. బయట నుంచి చూసినప్పుడు వారు చెప్పే మాటలు విన్నప్పుడు.. ఎంత గొప్ప ఆదర్శమన్న భావన కలుగక మానదు. పైకి సేవాభావాన్ని ప్రదర్శించే వారి అసలు రంగు తెలిస్తే.. నోట మాట రావటం తర్వాత.. మరీ ఇంత నీచమా? అని అసహ్యం కలుగక మానదు.

ఏపీలో సంచలనంగా మారిన పసికందుల వ్యాపారం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే. సాయం చేసే చేతుల పేరుతో.. చంటిపిల్లల అక్రమ వ్యాపారం చేసే దుర్మార్గాలు షాకింగ్ గా అనిపించక మానదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు.

విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు.. పేదరికంతో ఇబ్బంది పడే గర్భిణులకు సాయం అందిస్తారు. ఈ సాయం వెనుక దారుణమైన వ్యాపారం ఉంది. ఈ సెంటర్ కింద పని చేసే సిబ్బంది గ్రామాల్లో తిరుగుతుంటారు. ఉచిత వైద్య శిబిరాల్ని నిర్వహిస్తుంటారు.

తమ వద్దకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్లు నటించి.. వారి ఆర్థిక పరిస్థితి గురించి.. కుటుంబ నేపథ్యంలో గురించి తెలుసుకుంటారు. అనంతరం వారికి వైద్యం చేస్తూనే.. పుట్టినంతనే పిల్లల్ని అప్పజెప్పేస్తే డబ్బులు ఇస్తామని.. ఉచితంగా డెలివరీ చేస్తామని ఆశ పెడతారు.

పుట్టిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాయమాటలు చెప్పేస్తారు.ఈ దుర్మార్గం ఇక్కడితో ఆగదు. అలా తాము తీసుకున్న పిల్లల్ని.. ఎవరికైతే ఇస్తారో.. వారికే పుట్టినట్లుగా రికార్డులు తయారు చేసి.. సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఇటీవల కాలంలో ఇలా పలువురు పిల్లల్ని అక్రమంగా అమ్మిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి బాధ్యులైన ఆరుగురిని అరెస్టు చేశారు.

2010లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏర్పాటు చేయటం.. దీనిపై ఫిర్యాదులు రావటంతో దాన్ని తర్వాత కాలంలో ఫెర్టిలిటీ సెంటర్ గా పేరు మార్చారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సంస్థ ఎండీ డాక్టర్ నర్మతను పోలీసులు ఆదివారం కర్ణాటకలో అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.