అమరావతిలో అమ్మకానికి 1600 ఎకరాలు?

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తాజాగా హైకోర్టుకు వెల్లడించింది. రైతుల వద్ద నుంచి గత ప్రభుత్వం సమీకరించిన భూమిలో 1600 ఎకరాల్ని అమ్మకానికి పెట్టినట్లుగా పేర్కొంది. ఇంతకూ ఆ 1600 ఎకరాలు ఏమిటన్న విషయంలోకి వెళితే.. మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

అప్పట్లో చంద్రబాబు సర్కారు సింగపూర్ సంస్థల కన్సార్షియంకు కేటాయించిన భూముల్ని తర్వాత కాలంలో వెనక్కి తీసుకోవటం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ భూముల్ని అమ్మకానికి పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఈ భూముల అమ్మకాల్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో స్టార్టప్ ల కోసం సింగపూర్ కు చెందిన అసెండాస్.. సింగ్ బ్రిడ్జ్.. సెంబ్ కార్స్ సంస్థల కన్సార్షియంకు నాటి బాబు సర్కారు 1691 ఎకరాల్ని కేటాయించింది. ఈ ప్రాంతాన్ని సింగపూర్ సంస్థలతో కలిసి అమరావతి డెవలప్ మెంట్ సంస్థలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేయాలని భావించాయి.

ఒప్పందాలు ఓకే అయి.. ప్రాజెక్టు ప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వాలు మారాయి. ఇదే సమయంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. రాజధానుల విషయంలో వికేంద్రీకరణ చేపట్టాలని భావించింది. అందుకే సింగపూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల నుంచి వైదొలిగి.. 1600 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. అదే సమయంలో ఆ భూముల్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తమవుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

భూముల అమ్మకంతో ప్రభుత్వానికి తగినంత ఆదాయం వస్తుందని అధికారులు వాదిస్తున్నారు. ఓవైపు రైతుల నుంచి సమీకరించిన భూములు రాజధాని డెవలప్ మెంట్ కోసం కాకుండా ఇలా అమ్మటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.