ప్ర‌శ్న‌ల‌ శిఖ‌రం అస్త‌మ‌యం.. ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌న్నుమూత‌

ప్ర‌శ్నించేవారు లేక‌పోతే… ప్ర‌జాస్వామ్య‌మే లేద‌ని అంటారు అరిస్టాటిల్. కానీ, రాను రాను.. ప్ర‌శ్నించే గ‌ళాలు తగ్గిపోతున్నాయి. అంతేకాదు.. ప్ర‌శ్నించేవారిని అణిచేస్తున్న ప‌రిస్థితులు ప్ర‌పంచ దేశాల్లో త‌ర‌చుగా క‌నిపిస్తూనే ఉంది. ఈ చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే.. భార‌త దేశం ప్ర‌పంచంలో అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం. ఇక్క‌డున్నంత భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ మ‌రెక్క‌డా లేద‌ని కూడా అంటారు(?). అయితే.. ఇక్క‌డ కూడా ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్నాయి.

ఇదిలావుంటే.. గ‌త మూడు ద‌శాబ్దాలుగా త‌న‌దైన పంథాతో ప్ర‌శ్న‌లు గుప్పించిన మేధావి, ఢిల్లీ యూనివ ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్‌.. జీఎన్‌ సాయిబాబా అస్త‌మించారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల కింద‌ట ఢిల్లీలోని నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి క‌న్నుమూశారు. అయితే.. ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సి వ‌స్తే.. ఆయ‌న దివ్యాంగులు. అయినా.. మేధోసంప‌త్తితో స‌మాజంపై ప్ర‌భావం చూపించారు.

త‌న ప్ర‌శ్న‌ల ద్వారా స‌మాజ స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చారు. ముఖ్యంగా భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ పై కొన్నిద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న దాడుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. ‘స‌మాచార హ‌క్కు’ అనే దాని రూప క‌ల్ప‌న వెనుక‌.. ప్రొఫెస‌ర్ సాయిబాబా కృషి ఎంతో ఉంద‌ని అంటారు. స‌మాచార హ‌క్కు ద్వారా స‌ర్కారు ను ప్ర‌శ్నించే హ‌క్కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇదొక్క‌టే కాదు.. ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా కూడా ఆయ‌న అనేక వ్యాసాలు రాశారు.

కానీ, మావోయిస్టుల విష‌యంలో సాయిబాబా ఎంచుకున్న పంథానే వివాదాస్పదం అయింది. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మావోయిస్టుల ఏరివేత‌కు ఆర్మీని వినియోగించాల‌ని భావించిన‌ప్పుడు.. అనేక మందితో క‌లిసి సాయిబాబా వ్య‌తిరేక స‌భ‌లు పెట్టారు. ఆర్మీ అంటే.. సొంత పౌరుల‌ను(వారెవ‌రైనా స‌రే) చంపేందు కు కాద‌ని.. భార‌త పౌరుల‌ను ర‌క్షించేద‌ని ఎలుగెత్తి చాటారు. ఫ‌లితంగా దేశ వ్యాప్తంగా అప్ప‌టి కాంగ్రెస్ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది.

అయితే.. మోడీ పాల‌న ప్రారంభించిన త‌ర్వాత‌.. అనూహ్యంగా  2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌నపై మావోయిస్టు సానుభూతిప‌రుడు అనే ముద్ర ప‌డింది. అంతేకాదు.. మ‌హారాష్ట్ర‌లోని ఓ ప్రాంతంలో ప్ర‌ధాని మోడీని హ‌త‌మార్చేందుకు జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్న స‌మావేశం అజెండాను కూడా సాయిబాబానే రూపొందించార‌ని ఎన్ ఐఏ అధికారులు అభియోగం మోపారు. ఈ నేప‌థ్యంలో 2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది.

అప్ప‌టి నుంచి ఈ ఏడాదిమార్చి 5వ తేదీ వ‌ర‌కు.. జైల్లోనే ఉన్న సాయిబాబా.. బాంబే హైకోర్టు తీర్పు (నిర్దోషిగా)తో జైలు నుంచి విడుదలయ్యారు. సాయిబాబా జీవితం అత్యంత విషాదం ఏంటంటే..ఆయ‌న మాతృమూర్తి మ‌ర‌ణించిన‌ప్పుడు కూడా చివ‌రి చూపున‌కు అవ‌కాశం ల‌భించ‌క‌పోవ‌డం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌దే ప‌దేచెప్పుకొని విల‌పించిన సంద‌ర్భాలు ఉన్నాయి. మేధావిగా, హక్కుల ఉద్యమకారుడుగా, రచయితగా గుర్తింపు పొందిన సాయిబాబా.. ప్ర‌శ్న‌ల శిఖ‌రంగా మిగిలిపోయారు.