ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే.. నాయకులు ముందుకు రావాలి. నాయకులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు రావడం కాదు! ఇదీ.. రాజకీయంగా ఎవరైనా చెప్పేమాట. కానీ.. అదేంటో కానీ.. వైసీపీలో మాత్రం ఈ తరహా రాజకీయం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఏపీ మొత్తం కాకపోయినా.. దాదాపు 5 జిల్లాలు ప్రస్తుతం నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు రాత్రులు, మూడు పగళ్లుగా వరదలో చిక్కుకున్నవారు అలమటిస్తున్నారు. తమకు కనీసం ఆహారం అందించినా.. చాలని అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో సర్కారు తరఫున శాయశక్తులా పని చేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
మరి ప్రతి పక్షం వైసీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరైనా.. వచ్చారా? ఆపన్నులకు ఆదరంగా నిలిచారా? మేమున్నాంటూ.. ముందుకు వచ్చి సాయం చేయగలిగారా? అంటే.. లేదనే చెప్పాలి. ఎక్కడా కూడా వైసీపీ నాయకులు ముందుకు వచ్చిన పరిస్థి తి అయితే కనిపించలేదు. ప్రభుత్వం పోయి.. కేవలం మూడుమాసాలే అయింది. ఇంతలోనే ప్రజలు అంత వెగటు కొట్టేశా రా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విజయవాడలో పూర్తిగా వరద నీరు చేరుకుని.. శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలుబిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి వారికి ఇప్పుడు కావాల్సింది .. రాజకీయాలు కాదు. సాయం! అది ఎవరు చేసినా ఓకే. కానీ, వైసీపీ నాయకులు మాత్రం మాకు ఓటేయలేదు కదా.. మేమెందుకు చేస్తాం అన్నట్టుగా విజయవాడ నాయకులు వ్యవహరిస్తున్నారు. నిజానికి బలైమన నాయకులు విజయవాడలో ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఎమ్మెల్యేలుగా చేసిన వారే. కానీ, వారి ప్రాంతాలే మునిగిపోయినా.. వారిద్దరూ ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం బాధితులను పరామర్శించేందుకు కూడా ఇద్దరూ ముందుకు రాలేదు. కేవలం సీఎం జగన్ పర్యటనలో అలా కనిపించి.. ఇలా మాయమయ్యారు. మరి ఇలా ఉంటే.. వారికి భవిష్యత్తులోనూ ప్రజలు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న రాదా?! నాయకులు ఆలోచించుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates