ఈ తరం చూడని వానతో విజయవాడ వణికిపోయింది. ఇదే విషయాన్ని రికార్డుల్లో చూస్తే.. షాకింగ్ నిజం వెలుగు చూసింది. 20 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎప్పుడూ లేని విధంగా ఒక రోజు వ్యవధిలో కురిసిన 29 సెంటీమీటర్ల మాయదారి వాదనకు బెజవాడ మొత్తం బెంబేలెత్తింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వన్ టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. ఈ షాకింగ్ ఉదంతంలో మొత్తం ఆరుగురు మరణించారు. కొండ చరియలు విరిగి పడిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోవటం ఇటీవల కాలంలో ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక.. వర్షాల కారణంగా గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి మరో పెద్ద వయస్కురాలు మరణించారు. ఇక.. విజయవాడకు వస్తే ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగర జీవనం అల్లకల్లోలం కావటమే కాదు.. వరద దెబ్బకు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు లాంటి భారీ వాహనాలు పడవల మాదిరి మారాయి. మొత్తంగా 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడ పట్టణంలోని అన్ని కాలనీలు, శివారు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.
కుండపోతగా వర్షం కురవటం ఒక ఎత్తు అయితే.. ఎక్కడా సరైన డ్రెయిన్లు లేకపోవటం మరో ప్రధాన లోపంగా మారింది. అన్ని చోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీళ్లు నిలిచిన పరిస్థితి. విజయవాడ వ్యాప్తంగా.. ఇక్కడ.. అక్కడ అన్న తేడా లేకుండా పట్టణం మొత్తం నీళ్లతో నించిపోయిన పరిస్థితి. కుండపోతగా కురిసిన వర్షం ఒక ఎత్తు అయితే.. సరైన డ్రెయిన్లు లేకపోవటం విజయవాడకు శాపంగా మారింది. పడే వాన భారీగా ఉండటం..బయటకు వెళ్లాల్సిన నీళ్ల మార్గం లేకపోవటంతో.. విజయవాడ మొత్తం జలమయంగా మారింది.
విజయవాడలో వర్షం 31వ తేదీ (శనివారం) ఉదయం 17సెంటీమీటర్లు అయితే.. సాయంత్రం నాలుగు గంటల నాటికి 12.1 సెంటీమీటర్లు. అదే సమయంలో విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో శనివారం ఉదయం నాటికి 16.7 సెంటీమీటర్ల వర్షం పడితే.. సాయంత్రం నాలుగు గంటల నాటికి 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీ వానతో విజయవాడ.. దాని పరిసర ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిన పరిస్థితి. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో తాజా వానతో ఆస్తినష్టం తో పాటు.. దాదాపు 50వేల ఎకరాల్లో పత్తి చేలు వరదలో దెబ్బ తింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates