వినేశ్ ప‌త‌కంపై వీడ‌ని స‌స్పెన్స్

వినేశ్ ఫొగాట్‌.. పారిస్ ఒలింపిక్స్ సంద‌ర్భంగా ప‌త‌కాలు గెలిచిన అథ్లెట్ల‌ను మించి చ‌ర్చ‌నీయాంశం అయిన పేరింది. ఈ రెజ్ల‌ర్ 50 కేజీల విభాగంలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్‌కు చేరుకుని క‌నీసం ర‌జ‌త ప‌త‌కం ఖాయం చేసుకుంది. ఫైన‌ల్లో గెలిస్తే స్వ‌ర్ణ‌మే ద‌క్కేది. కానీ ఫైన‌ల్ బౌట్‌కు ముందు 100 గ్రాముల బ‌రువు ఎక్కువ ఉంద‌నే కార‌ణంతో ఆమె మీద అన‌ర్హ‌త వేటు వేశారు. ముందు రోజు పోటీల స‌మ‌యంలో నిర్ణీత బ‌రువే ఉన్న వినేశ్‌.. త‌ర్వాత బ‌రువు పెరిగింది. రాత్రంతా బ‌రువు త‌గ్గ‌డానికి ఎంతో శ్ర‌మించినా ఫ‌లితం లేక‌పోయింది. 2.7 కేజీల అద‌న‌పు బ‌రువులో చివ‌రికి 10 గ్రాములు అలాగే ఉండిపోయింది. దీంతో ఆమెకు ప‌త‌కం చేజారింది.

ఐతే తొలి రోజు బౌట్‌ల సంద‌ర్భంగా తాను స‌రైన బ‌రువే ఉన్న నేప‌థ్యంలో త‌న‌కు ర‌జ‌త ప‌త‌కం ఇవ్వాలంటూ ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)‌ను ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. దీని మీద కాస్ విచార‌ణ చేప‌ట్టింది. కానీ తీర్పును మాత్రం వెలువ‌రించ‌లేదు.

మంగ‌ళ‌వారం రాత్రి తీర్పును వెలువ‌రిస్తార‌ని భావించారు. దీంతో అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. కానీ త‌న లాయ‌ర్ల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం వినేశ్ కాస్ విచార‌ణ‌కు హాజరు కాగా.. తీర్పును వెలువ‌రించ‌కుండానే మ‌రోసారి వాయిదా వేశారు. కార‌ణాలేమీ చెప్ప‌కుండానే ఈ నెల 16కు తీర్పును వాయిదా వేశారు.

వినేశ్ త‌ర‌ఫున‌ హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించిన‌ట్లు తెలుస్తోంది. పోటీల తొలి రోజు ఆమె 49.9 కేజీల బ‌రువుంది. ఆ బ‌రువుతోనే పోటీల్లో పాల్గొంది. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ సెమీస్ చేరింది. అందులోనూ విజ‌యం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ బౌట్ల‌న్నీ ఒక్క రోజులోనే జ‌రిగాయి. త‌ర్వాతి రోజు రాత్రికి ఫైన‌ల్ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఉద‌యం బ‌రువు తూస్తే 100 గ్రాములు అధికంగా ఉంది. బౌట్‌ల మ‌ధ్య‌లో రెజ్ల‌ర్లు బ‌రువు పెర‌గ‌డం.. కొన్ని క‌స‌ర‌త్తులు చేసి త‌గ్గ‌డం మామూలే. కానీ వినేశ్ మాత్రం దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఎంత క‌ష్ట‌ప‌డ్డా వంద గ్రాములు బ‌రువు ఎక్కువే ఉండ‌డంతో ప‌త‌కం కోల్పోయింది.