భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు.
అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ ను చేర్చటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రఫేల్ ను నడిపేందుకు వీలుగా ఒక మహిళా పైలెట్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
కఠినమైన పరీక్షల్ని విజయవంతంగా సదరు మహిళా పైలట్ పూర్తి చేసిందని.. దీంతో ఆమెకు రఫెల్ ను నడిపే అవకాశం లభించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఆమె.. త్వరలోనే దాన్నిపూర్తి చేసుకొని రఫెల్ ను నడపనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆ మహిళా పైలెట్ ఎవరు? ఆమె ఎక్కడి వారు అన్న వివరాల్ని మాత్రం రక్షణ శాఖ వెల్లడించలేదు.