5 దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యను పరిష్కరించిన కరోనా !

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గడచిన ఆరుమాసాలుగా వణికించేస్తోంది. కరోనా వల్ల లక్షలాదిమంది ప్రజల ప్రాణాలు పోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిపై పెద్ద దెబ్బపడింది. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లక్రిందులైపోయింది. వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ పడినా పాజిటివ్ కూడా ఉందనే చెప్పాలి. 24 గంటలూ బిజీ బిజీ లైఫ్ గడిపే వారు ఇపుడు తమ కుటుంబసభ్యులతోనే కాలం గడుపుతున్నారు. ఇంతకుముందు పిల్లలను పట్టించుకోవటం కుదరని తల్లి, దండ్రులు ఇపుడు పూర్తి సమయాన్ని వాళ్ళపైనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఐటి, సాఫ్ట్ వేర్ తదితర రంగాల్లో బిజీగా ఉండేవారు వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఇంట్లో నుండి పని చేస్తున్నారు.

సరే ఈ లాభాల సంగతిని పక్కనపెట్టేస్తే అన్నింటికన్నా అతిపెద్ద లాభం మరోటుంది. అదేమిటంటే ఆహార వృధా తగ్గిపోవటం. మనదేశాన్ని ఎప్పటి నుండి పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆహారాన్ని వృధా చేయటం. ప్రతి సంవత్సరం కొన్ని వందల టన్నుల ఆహారం వృధాగా పోతోంది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు మొదలుకొని పదిమంది చేరే ఏ ఫంక్షన్లో అయినా సరే ఆహారం వృధాగా పోవాల్సిందే. ఆహార వృధాను తగ్గించుకోమని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోవటం లేదు. ఒకవైపు వందలాది టన్నుల ఆహారం వృధాగా పోతుంటే మరోవైపు కోట్లాదిమంది పేదలకు కడుపునిండా ఆహారం కూడా దొరకటం లేదు.

ఇటువంటి నేపధ్యంలోనే కరోనా వైరస్ ఒక్కసారిగా ఆహారం వృధా విషయంలో దేశగతినే మార్చేసింది. గడచిన ఆరుమాసాలుగా అంతకుముందుతో పోల్చచుకుంటే ఆహారం వృధా బాగా తగ్గిపోయినట్లు జాతీయ గణాకాంలు చెప్పాయి. దాదాపు అందరు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆహారం వృధా 40 శాతం నుండి 18 శాతానికి తగ్గిపోయిందట. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళతో పాటు ఇతర శుభకార్యాలు లేకపోతే అశుభకార్యాలు చేయటం కూడా తగ్గిపోయింది. పెళ్ళైనా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఇదివరకులా వందలమంది ఒకే చోట చేరటం లేదు. కుటుంబసభ్యులు లేదా మరీ దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఫంక్షన్లకు కలుస్తుండటంతో ఆహారం వృధా చాలావరకు తగ్గిపోయింది.

ఇదే సమయంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, బార్లు, లాడ్జీలు, మెస్సులు లాంటివి కూడా దాదాపు ఇంకా తెరుచుకోలేదు. దాంతో జనసంచారం తగ్గిపోయింది. కాబట్టి అక్కడ కూడా ఆహారం తయారు చేయటం దాదాపు ఆగిపోయింది. వీటన్నింటితో పాటు ఉద్యోగులు, వృత్తి, వ్యాపారస్తుల ఆదాయాలు కూడా గణనీయంగా పడిపోయాయి. కొన్ని లక్షలమందికి ఉద్యోగాలు పోవటంతో పాటు మరికొన్ని లక్షల మందికి ఉపాధి దెబ్బతిన్నది. దాంతో మధ్య, ఎగువ, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయాలు దెబ్బతినేశాయి. దాంతో అవసరం లేకపోయినా బయటకు వెళ్ళటం లేదు.

అవసరానికి పక్కనున్న పచారీ కొట్టుకే వెళ్ళి అవసరమైన సామాన్లను మాత్రమే కొనుక్కుని ఇళ్ళలోనే వంటలు చేసుకుని శుభ్రంగా భోంచేస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్ళలోని ఆహారం వృధా కూడా 23 శాతం నుండి 15 శాతానికి తగ్గిపోయింది. మామూలుగా అయితే పెద్ద పట్టణాలు, నగరాల్లో ఆహారవృధా సగటున 55 శాతం ఉంటుంది. అదే గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఆహార వృధా 35 శాతమట. ఓ సర్వే ప్రకారం పట్టణాలు, నగరాల్లో జనాల ఆదాయం 40 పడిపోయింది. అంటే పడిపోయిన ఆదాయాల ప్రకారం ఖర్చులు కూడా తగ్గించుకున్నట్లు అర్ధమవుతోంది. మొత్తం మీద ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి మొత్తుకుంటున్నా తగ్గని ఆహారం వృధా కరోనా వైరస్ దెబ్బకు ఏ విధంగా తగ్గిపోయిందో .