ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల తమిళనాడుకు చెందిన గుకేష్ చెస్‌లో ప్రపంచ స్థాయి రికార్డు సాధించిన తర్వాత.. ఇప్పుడు అలాంటిదే.. దేవాన్ష్ కూడా.. సాధించడం గమనార్హం. దీనిపై `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్` నుంచి సర్టిఫికెట్ కూడా సాధించారు.
చెస్(చదరంగం)లో పావులదే కీలక పాత్ర. వీటిని చాలా జాగ్రత్తగా ముందుకు వెనక్కి నడిపించడంపైనే క్రీడాకారుడి మేథ ఆధరపడి ఉంటుంది. దీనిని బట్టే గెలుపు ఓటములు ఆధారపడిఉంటాయి. ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు సాగే క్రమంలో పావులను వేగంగా కదపడం.. కూడా పాయింట్లకు దోహదపడుతుంది. ఎంత వేగంగా పావులు కదిపారన్నది కూడా.. రికార్డుగానే మారుతుంది.
ఇలా వేగంగా పావులు కదపడంలోనూ.. ప్రత్యర్థి ఆలోచనలకు చిక్కకుండా ముందుకు సాగడంలోనూ.. దేవాన్ష్ రికార్డు సృష్టించినట్టు `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్` పేర్కొంది. 9 ఏళ్ల వయసున్న దేవాన్ష్.. వేగవంతమైన `చెక్‌మెట్ సాల్వర్ – 175 పజిల్స్`లో అద్భుతంగా రాణించారు. దీంతో ఆయన ప్రపంచ రికార్డును నెలకొల్పినట్టు `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్` పేర్కొంది.
ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. దీనిపై నారా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. తాతకు తగ్గ మనవడిగా దేవాన్ష్ నిలిచారని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.