పెద్ద పులి కారును ఢీ కొడితే?

వేగంగా వెళుతున్న కారును.. ఎవరైనా వ్యక్తి ఢీ కొడితే ఏమవుతుంది? మరుక్షణం సదరు వ్యక్తి చనిపోతాడు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం తీవ్ర గాయాలతో బయటపడతాడు. ఆ సందర్భంగా కారుకు జరిగే డ్యామేజ్ పెద్దగా ఉండదు. మరి.. అలానే ఒక పెద్ద పులి వేగంగా వెళ్లే కారును ఢీ కొడితే ఏమవుతుంది? ఊహకు కూడా అందని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. ఈ సందర్భంగా కారుకు జరిగిన డ్యామేజ్ అవాక్కు అయ్యేలా చేస్తోంది. కారు భద్రతకు సంబంధించిన కొత్త సందేహాలకు కారణమయ్యేలా చేస్తుంది.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లె వద్ద వేగంగా వెళుతోంది ఒక కారు. బద్వేలుకు చెందిన ఐదుగురు వ్యక్తులు నెల్లూరుకు వెళుతున్నారు. కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో రోడ్డును దాటే క్రమంలో ఒక పెద్ద పులి వేగంగా వచ్చి.. స్పీడ్ గా వెళుతున్నకారును ఢీ కొట్టింది. క్షణ కాలంలో ఏం జరిగిందన్నది కారులో ప్రయాణిస్తున్న వారికి సైతం అర్థం కాలేదు. కానీ.. వేగంగా వెళుతున్న కారు తనను ఢీ కొట్టిన పులిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది.

పెద్ద పులి కాళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే అది.. అడవిలోకి వెళ్లిపోయింది. కానీ.. బ్రేక్ వేసిన కారు డ్రైవర్.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం ఒక్కసారి షాక్ తిన్నారు. కారణం.. కారు బాయినెట్ మొత్తం తుక్కుతుక్కుగా మారటమే. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కారును పెద్ద పులి ఢీ కొట్టినా దానికి ఏం కాకపోవటం.. కారు మాత్రం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ మొత్తం ఉదంతంలో ఊరట కలిగించే అంశం ఏమైనా ఉందంటే.. కారులో ప్రయాణిస్తున్న వారెవరికి ఏమా కాకుండా.. క్షేమంగా బయటపడటం.