అతడొక బాధ్యతగల అధికారి. అంతే కాదు ప్రజల రక్షణగా నిలిచే పోలీసు అధికారి. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేందుకు అండగా నిలవాల్సిన అధికారి. కానీ ఆయనే తన ఓటును రూ.5 వేలకు కక్కుర్తిపడి అమ్ముకున్నాడు.
ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన మంగళగిరి స్టేషన్‌కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే, ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు పుచ్చుకున్నారు. ఆ మొత్తాన్ని ఎస్సైకి ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు.
ఖాజాబాబుకు బంధువైన ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు దొరికాడు. అతడిని పోలీసులు విచారించగా ఎస్సైకి డబ్బులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు విచారణ అనంతరం ఎస్సైపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. దీంతో ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates