మంట‌ల్లో కాలిపోయిన మేనేజింగ్ డైరెక్ట‌ర్

తెలంగాణ‌లోని ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఒక్క‌సారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజింగ్ డైరెక్ట‌ర్ రవి మంట‌ల్లో కాలిపోయారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఆరుగురు కూడా మంట‌ల్లో చిక్కుకుని స‌జీవ ద‌హ‌న‌మ‌యిన‌ట్టు అధికారులు తెలిపారు. మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. చుట్టుపక్కల వారిని యుద్ధ ప్రాతిప‌దిక‌న అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృత‌దేహాల‌ను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలముకున్నాయి. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు, ఉద్యోగులు కంపెనీ లోపల ఉన్నట్లు సమాచారం. 4 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి భయానక వాతావరణం ఏర్ప‌డింది.

అయితే.. రియాక్ట‌ర్ వంటి భారీ పేలుడు వ‌స్తువుల‌ను నిర్వ‌హించ‌డంలో ప‌రిశ్ర‌మ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌రైన స‌మ‌యంలో రియాక్ట‌ర్ల‌ను నిర్వ‌హించ‌డం లేదని.. సాధార‌ణంగానే వాటిని నిర్వ‌హిస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఎండ తీవ్ర‌త పెరిగిన నేప‌థ్యంలో రియాక్ట‌ర్ వంటి భారీ పేలుడు గుణం ఉన్న వాటి విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. నీటి స‌దుపాయాన్ని పెంచుకోవాల్సి ఉంద‌ని.. కానీ,ఈ రెండు విష‌యాల్లోనూ ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే ద‌ర్యాప్తు చేస్తున్నారు.