టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు కేంద్ర ప్రభుత్వం నేరుగా ‘Z’ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన ఇప్పుడు ఇంటి గుమ్మం నుంచి బయటకు రాగానే ‘ఏపీ 47’ తుపాకులు పట్టుకుని ఉన్న నలుగురు ఆయనను ఫాలో అవుతారు. వీరితో పాటు ఇతర భద్రతా సిబ్బంది కూడా.. ఉంటారు. మొత్తంగా ఆయన కట్టదిట్టమైన భద్రతలో అయితే ఉండిపోయారు. ఇది బాగుందని టీడీపీ నాయకులు అంటున్నారు.
అయితే.. వాస్తవం ఏంటి? ఎదుగుతున్న నేతకు జడ్ భద్రతతో కలిగే ప్రయోజనం ఎంత? అనేది ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా 2012లో వైసీపీ అధినేత జగన్ గురించి జరిగిన ఓ ఘటనను చెప్పాలి. అప్పట్లో ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు. ఈ సమయంలో వైసీపీకి చెందిన నాయకుడు.. ఒకరు తమ నాయకుడు జగన్‌కు భద్రత కల్పించేలా కేంద్రాన్ని(అప్పట్లో యూపీఏ) ఆదేశించాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి.. జగన్‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించింది.
దీనికి కారణంగా.. ఆయన మాజీ సీఎం కుమారుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జిల్లా నుంచి వచ్చారు. పైగా పార్టీ అధినాయకుడు అన్న వైసీపీ నేత వాదనను కోర్టు బలపరిచింది. దీంతో విధిలేని పరిస్థితిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. అయితే.. ఈవిషయం తెలిసిన.. జగన్.. తనకు ఎవరూ అవసరం లేదని.. తన భద్రత ప్రజలు చూసుకుంటారంటూ.. ఆయన వారిని తిరస్కరించారు. ఇక, కేంద్రం కూడా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.
ఫలితంగా జగన్‌ను కలుసుకునేందుకు.. సామాన్య ప్రజలకు కూడా అవకాశం లభించింది. ఇది ఆయనకు అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు నారా లోకేష్‌కు వచ్చిన ప్రాణ భయం అంటూ ఏమీలేదు. పైగా.. ఆయనేమీ మావోయిస్టు థ్రెట్‌లోనూ లేరు. మాజీ సీఎం కుమారుడిగా వైసీపీ ప్రభుత్వమే.. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది. కానీ, దీనిని వద్దని జడ్ కేటగిరీ తెచ్చుకున్నారు. దీనివల్ల సామాన్యులకు లోకేష్ దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది.
సామాన్యులను ఎవరూ జడ్ కేటగిరీలో ఉన్న నాయకుల వద్దకు రానివ్వరు. ఆయన కోరితే తప్ప.. ఎవరినీ కలవనివ్వరు. ఎక్కడో గర్భగుడిలో కూర్చుకున్న శ్రీవారి మాదిరిగా పరిస్థితి మారిపోతుంది. ఇది.. ఎదుగుతున్ననాయకుడికి సరికాదనే వాదన కూడా రెండో కోణంలో వినిపిస్తుండడం గమనార్హం. ఇక, పార్టీ కేడర్ కూడా ఇప్పుడు దగ్గరకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మొత్తంగా ప్లస్ కంటే మైనస్ ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు.

Gulte Telugu Telugu Political and Movie News Updates