ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరిక విషయంపై కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ సంధించారు. ఆయన తాజాగా రాసిన లేఖ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను రమ్మన్నానని.. చాలా మంది వచ్చేందుకు రెడీ అయిపోయారు. అయితే, ఇంత మంది వస్తే.. అక్కడ(తాడేపల్లి) ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బంది అవుతుందంట. అందుకే మీరెవరూ రావొద్దు.. నేనే వెళ్లి జాయిన్ అయిపోతాను.
అని తాజాగా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 14న ఆయన మూహూర్తం పెట్టుకుని.. తన అభిమానులు, అనుచరులు కూడా తన వెంట వచ్చేవారు రావాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎవరి భోజనాలు, ఖర్చులు వారే పెట్టుకోవాలని మంచినీళ్లు కూడా వెంట తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై నెటిజన్ల నుంచి సటైర్లు కూడా పేలాయి. ఇదిలావుంటే.. తాజాగా రాసిన లేఖలో ఆయన చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ముద్రగడ తాజా లేఖ ఇదీ..
“గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్‌సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి”