కేజీ చికెన్ రూ.300 దాటేసింది.. .అసలు కారణమిదే!

చికెన్ ధర కొండకెక్కింది. చూస్తుండగానే కేజీ చికెన్ ధర రూ.300 దాటేసింది. ఎందుకిలా? అంటే.. ఒక్కసారిగా విరుచుకుపడిన అనేక సమస్యలు దీనికి కారణంగా చెప్పాలి. చికెన్ ప్రియులకు షాకిచ్చేలా మారిన ఈ ధరల దెబ్బకు జేబులు చిల్లులు పడుతున్నాయి. ఏపీలో పెరిగిన చికెన్ ధరల కారణంగా తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఇటీవల కాలంలో ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీనికి తోడు వేసవి కాలం కావటంతో ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు కార్తీక మాసంలో కోడి మాంసానికి డిమాండ్ విపరీతంగా పడిపోయింది. అప్పట్లో కేజీ రూ.130 – 140 మధ్యనే అమ్మాల్సి వచ్చింది. దీంతో కోళ్ల ఫారాల యజమానులకు భారీగా నష్టాలు చూశారు.

దీంతో.. కోళ్ల ఉత్పత్తిని భారీగా తగ్గించారు. తల్లికోళ్లను గిట్టుబాటు కాక అమ్మేశారు. దీంతో.. ఉత్పత్తి తగ్గింది. కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఏపీలో పెద్ద ఎత్తున కోళ్లకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావటం.. వేలాదిగా చనిపోయిన పరిస్థితి.

దీని ప్రభావం తెలంగాణ మీదా పడింది. మొత్తంగా పెరిగిన చికెన్ ధరలతో చికెన్ ప్రియులు మాత్రం ఠారెత్తిపోతున్నారు. వేసవిలో చికెన్ ధరలకు రెక్కలు రావటం మామూలే. అయితే.. వేసవి కాలం అధికారికంగా మొదలు కానప్పటికీ ధరలు ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరుకుంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది.