ఢిల్లీ ర‌ణ‌రంగం.. క‌ళ్లు, కాళ్లు, చెవులు పోగొట్టుకున్న రైత‌న్న‌లు!

దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లే దారుల‌న్నీ.. యుద్ధాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ బారికేడ్లు, ఆధార్ కార్డుల వెరిఫికేష‌న్‌.. వాహ‌నాల విస్తృత త‌నిఖీల‌తో పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల‌ను దాదాపు మ‌రిపిస్తున్నాయి. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు ఇచ్చే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు(ఎంఎస్పీ) చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని.. స్వామి నాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. పంజాబ్‌, హ‌రియాణ‌, ఢిల్లీ రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం వారిని ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ క్ర‌మంలో పోలీసులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది.. సోనిక్ ఆయుధాల‌ను ప్ర‌యోగించారు. అదేవిధంగా టియ‌ర్ గ్యాస్‌ను నిరంత‌రాయంగా విడిచి పెడుతున్నారు. ఇక‌, ర‌బ్బ‌ర్ బుల్లెట్ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రుపుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. రైతులు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పోలీసులు చేస్తున్న బ‌ల ప్ర‌యోగాన్ని వారు.. నేరుగా ఎదిరిస్తున్నారు. ఈ క్ర‌మంలో రైతులు తీవ్రంగా గాయ‌ప‌డుతున్నారు. సోనిక్ ప్ర‌యోగంతో భారీ శ‌బ్దాలు వెలువ‌డి.. ప‌దుల సంఖ్య‌లో రైతులు గ్ర‌హ‌ణ శ‌క్తిని కోల్పోయారు. దాదాపు 50 మందికి చెవుల్లోంచి ర‌క్తం కారి. వారి వినికిడి శ‌క్తి కోల్పోవ‌డంతోపాటు.. చెవి న‌రాలు కూడా చిట్లిపోయాయి.

ఇక‌, ర‌బ్బ‌ర్ బుల్లెట్ల కాల్పుల కార‌ణంగా.. కాళ్లు కోల్పోయిన వారి సంఖ్య కూడా.. 50 దాటిపోయింది. ఇక‌, టియ‌ర్ గ్యాస్ నిరంత‌రాయంగా విడిచి పెడుతుండ‌డంతో పూర్తిగా కళ్లు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరింది. మ‌రింత మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఉద్య మం కొన‌సాగుతుంద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో దిగిరాక త‌ప్ప‌ద‌ని.. రైతులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. కేంద్ర మంత్రులు మాత్రం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని.. రైతులు ఆందోళ‌న విర‌మించా ల‌ని కోరుతున్నారు.

ఇప్ప‌టికిప్పుడు ఎంఎస్‌పీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేమ‌ని వారు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రోడ్డు మార్గంలో ఢిల్లీ వెళ్లేవారు.. నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చాలా రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారిని దాదాపు 150 కిలో మీట‌ర్ల దూరంలోని ర‌హ‌దారి గుండా దారి మ‌ళ్లించి ఢిల్లీకి పంపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.