సింహంతో సెల్ఫీ.. త‌ర్వాత ఘోరం.. తిరుప‌తిలోనే!

సెల్ఫీ మోజు ఓ యువ‌కుడుని అర్ధంత‌రంగా బ‌లి తీసుకుంది. తిరుప‌తిలోని శ్రీవేంక‌టేశ్వ‌ర జూపార్కుకు వ‌చ్చిన ఓ యువ‌కుడు.. అంద‌రితోపాటు.. జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌లో తిరిగాడు. ఇంత‌లో చుట్టుప‌క్కల ఉన్న జంతువుల‌తో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెంద‌లేదు. కొంత దూరంలో ఉన్న ‘ల‌య‌న్ ఎన్ క్లోజ‌ర్‌’లోకి వెళ్లాడు. వాస్త‌వానికి ల‌య‌న్ ఎన్ క్లోజ‌ర్‌లోకి ఎవ‌రినీ అనుమ‌తించ‌రు.

తాజాగా ల‌య‌న్ ఎన్ క్లోజ‌ర్‌లోకి ఎవ‌రు అత‌నిని అనుమ‌తించార‌నేది తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎలాంటి అనుమ‌తి లేకుండా వెళ్ల‌డా? అనేది తెలియాల్సి ఉంది. పోనీ.. వెళ్లిన వాడు వెళ్లిన‌ట్టుగా ఏదో ఫొటోతీసుకుని వ‌చ్చేయాలి క‌దా.. కానీ, అలా కూడా చేయ‌లేదు. సింహాన్నినిద్ర‌లేపి మ‌రీ దాని ముందు నిల‌బ‌డి తొడ‌గొట్టా డు. అప్ప‌టి వ‌ర‌కు మాగ‌న్నుతో ఉన్న సింహం.. ఈ చిలిపి చేష్ఠ‌ల‌కు..క‌ళ్లు తెరిచింది. మ‌ళ్లీ మ‌నోడు ఊరుకోకుండా.. మ‌ళ్లీ మ‌ళ్లీ తొడ‌గొట్టాడు.

అంతే.. సెల్ఫీ మాటేమో కానీ.. సింహం దూసుకువ‌చ్చింది. పెద్ద గాండ్రింపుతో మీద‌కు దూకింది. అక్క‌డే ఉన్న చెట్టేందుకు యువ‌కుడు ప్ర‌య‌త్నించిన ఫ‌లితం క‌నిపించ‌లేదు. ఒక్క ప‌ట్టు బ‌ట్టి.. కిందికి లాగేసింది. ఆ వెంట‌నే గొంతు ప‌ట్టుకుని చంపేసింది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏదేమైనా.. సెల్ఫీ పిచ్చి.. యువ‌కుడి ప్రాణాలు హ‌రించేసింది.