‘ప్రపంచకప్ ఫైనల్’ వాడకం మామూలుగా లేదు

అసలే ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. పైగా ఇండియా ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో రసవత్తర పోరును చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ మీద ఉండే ఆసక్తి, అంచనాల గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది అభిమానులు స్టేడియాలకు వచ్చిన ప్రపంచకప్‌గా ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. టీవీ వ్యూయర్ షిప్‌ విషయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫైనల్‌కు మరిన్ని కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

మొన్న సెమీస్ సందర్భంగా ఒకేసారి నాలుగున్నర కోట్ల మంది డిస్నీ-స్టార్ యాప్‌లో క్రికెట్ మ్యాచ్ చూశారు. ఇది రికార్డు. ఫైనల్లో ఈజీగా ఐదు కోట్ల వ్యూస్ మార్కును దాటేస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఇంత వ్యూయర్ షిప్‌ ఉన్నపుడు యాడ్స్ ధరలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. మామూలుగా 10 సెకన్ల టైంకి మ్యాచ్ ఆసక్తిని బట్టి రూ.10-20 లక్షల మధ్య ఛార్జ్ చేస్తుంటారు. గరిష్టంగా ఈ రేటు రూ.25 లక్షల వరకు ఉంటుంది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం డిస్నీ-స్టార్ వాళ్లు పది సెకన్ల యాడ్‌కు ఏకంగా రూ.35 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట.

ఇక అహ్మదాబాద్‌లో ఆదివారం నాడు హోటల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఒక గదికి ఒక్క రాత్రికి రూ.2 లక్షల దాకా చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందట. సాధారణ హోటళ్లు సైతం భారీగా ధరలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్‌కు ముందు రోజు ఇండియా ప్రాక్టీస్ సెషన్‌ను సైతం క్యాష్ చేసుకోవడానికి బ్రాడ్‌కాస్టర్ రెడీ అయిపోయింది.

ఈ రోజు ప్రాక్టీస్ సెషన్‌‌ను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇక మ్యాచ్ రోజు ఆరంభ సమయం కంటే 7 గంటల ముందు నుంచే డిస్కషన్లతో స్ట్రీమింగ్ మొదలవుతుందట. మొత్తానికి ఇండియాలో ఇండియా ఫైనల్ ఆడటం ఏమో కానీ.. దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి.