విరాట్-అనుష్క ‘పండంటి బిడ్డ రాబోతోంది’

క్రికెటర్లు, సినిమా వాళ్లు పెళ్లి చేసుకుని కొన్ని నెలలు గడవగానే శుభవార్త కోసం ఎదురు చూస్తారు మీడియా వాళ్లు, అభిమానులు. మూడేళ్ల కిందట క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకుని ఏడాది గడిచిందో లేదో ఈ విషయంలో ఆరాలు మొదలయ్యాయి.

కానీ వాళ్లు అలాంటి సంకేతాలేమీ ఇవ్వలేదు. ఐతే అందరూ ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఇప్పుడొచ్చింది. అనుష్క గర్భం ధరించిన విషయాన్ని ఈ జంట గురువారం వెల్లడించింది. తామిద్దరం ముగ్గురవుతున్నామని.. 2021లో ప్రసవం జరగబోతోందని కోహ్లి ట్విట్టర్లో వెల్లడించాడు.

మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోంది అని అతను ట్విట్టర్లో పేర్కొన్నాడు. బేబీ బంప్‌తో ఉన్న అనుష్క ఫొటోను కోహ్లి పోస్ట్ చేశాడు. దీంతో సామన్యులు, సెలబ్రిటీలు విరుష్క జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కోహ్లి-అనుష్కల ప్రేమాయణం ఆరేడేళ్ల కిందట మొదలైంది. రెండేళ్లకు పైగా బంధంలో ఉన్నాక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కోహ్లి వెంటనే పెళ్లి చేసుకుందాం అంటే.. బాలీవుడ్ కెరీర్ దృష్ట్యా అనుష్క అందుకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి.

ఐతే ఏడాదికి మించి వీళ్లిద్దరూ దూరంగా ఉండలేకపోయారు. ఆశ్చర్యకరంగా మళ్లీ కలిశారు. ఆ తర్వాత కొంత కాలానికే.. 2017 డిసెంబరులో వీరి పెళ్లి జరిగింది. విరాట్, అనుష్కలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో పలు సందర్భాల్లో రుజువైంది. తనకు ఏమాత్రం ఖాళీ దొరికినా అనుష్కతోనే గడుపుతాడు విరాట్. ఆమె కూడా అంతే.

ఈ మధ్య సినిమాలు కూడా తగ్గించేసిన అనుష్క.. లాక్ డౌన్ టైంలో పూర్తిగా కోహ్లితోనే సమయం గడిపింది. ఆ సమయంలోనే ఇద్దరూ బిడ్డకు జన్మనివ్వడంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. జనవరిలో ప్రసవం అంటే.. ప్రస్తుతం అనుష్కకు ఐదో నెల అని అర్థమవుతోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)