మరో సంచలనం..ఇంగ్లండ్ కు శ్రీలంక షాక్

భారత్ లో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ క్రికెట్ లో వరుసగా సంచలన విజయాలు నమోదవుతున్నాయి. పసికూనలుగా బరిలోకి దిగిన జట్లు అనూహ్యంగా ఛాంపియన్ టీమ్ లను మట్టికరిపిస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్ వంటి అప్ కమింగ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఖంగు తినిపించింది. ఆ షాక్ నుంచి ఇంగ్లండ్ తేరుకోక ముందే శ్రీలంక జట్టు ఇంగ్లండ్ కు షాకిచ్చింది. ఇంగ్లండ్ జట్టుపై లంక అనూహ్య విజయం సాధించి వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసింది. పొరుగు జట్ల జయాపజయాలపై ఇంగ్లండ్ ఆధారపడేలా చేసింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టుపై శ్రీలంక విజయం సాధించింది.

పురుషుల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో మరో సంచలన విజయం నమోదైంది. ఈ టోర్నీలో తడబడుతున్న శ్రీలంక జట్టు…బలమైన ఇంగ్లండ్ పై గెలిచింది. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టును లంక బౌలర్లు 156 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత 157 పరుగుల లక్ష్యాన్ని మరో 24 ఓవర్లు మిగిలి ఉండగానే 2 వికెట్లు నష్టపోయి శ్రీలంక జట్టు ఛేదించింది. స్టోక్స్ (43) మినహా మరే బ్యాట్స్ మన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. లంక ఓపెనర్ నిశాంక(77), సమరవిక్రమ(65) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన లంక బౌలర్ లహిరు కుమార (3/35)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది.

ఈ సిరీస్ లో ఇంగ్లండ్ కు మొదటి షాక్ అఫ్ఘాన్ టీమ్ ఇచ్చింది. ఆ విజయం గాలి వాటం అనుకుంటున్న వారి నోళ్లు మూయిస్తూ పాకిస్థాన్ పై కూడా అఫ్ఘానిస్థాన్ ఛాంపియన్ టీమ్ లా ఆడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో తన తదుపరి మ్యాచ్ లో భారత్ తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి లేకుండా దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాను పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయిన ఇంగ్లండ్ జట్టు ఏమాత్రం నిలువరిస్తుందో చూడాలి.

భారత్ తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లతో తలపడాల్సి ఉంది. నెదర్లాండ్స్ ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఇక, ఆసీస్, పాక్ లతో ఇంగ్లండ్ కు గట్టి పోటీ ఎదురౌతుంది. టైటిల్ రేసులో ఇంగ్లండ్ నిలవాలంటే మిగతా నాలుగు మ్యాచ్ లు కచ్చితంగా గెలిచి మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.