భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు రికార్డుల మోత మోగించింది. ఈ రోజు ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సఫారీ జట్టు విధ్వంసం సృష్టించింది. శ్రీలంక బౌలర్లను సఫారీ బ్యాట్స్మెన్ ఊచ కోత కోశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి శ్రీలంక ముందు 428 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ క్వింటన్ డీకాక్ 84 బంతుల్లో సెంచరీ చేయగా…వాన్ డె డస్సెన్ 110 బంతుల్లో 108 పరుగులతో సెంచరీ బాదాడు. ఇక, వీరిద్దరూ ఔటైన ఆనందాన్ని లంక బౌలర్లకు మిగల్చకుండా డేంజరస్ బ్యాట్స్మెన్ మార్క్రం విధ్వంసరకర బ్యాటింగ్ తో 54 బంతుల్లోనే 106 పరుగులతో వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 49 బంతుల్లోనే సెంచరీ చేసిన మార్ క్రమ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓ బ్రెయిన్ పేరిట ఉంది. 2011 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ మీద 50 బంతుల్లోనే కెవిన్ ఓ బ్రెయిన్ సెంచరీ బాదాడు.
ఇక, వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద ఆస్ట్రేలియా జట్టు 417 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక, ఆ తర్వాత 2007 వరల్డ్ కప్ లో బెర్ముడా మీద భారత్ 413 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు, ఈ రోజు ఉదయం జరిగిన ఇంకో మ్యాచ్ లో అఫ్ఘానిస్థాన్ పై బంగ్లాదేశ్ సునాయస విజయం సాధించింది. సమిష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెహ్‌దీ హసన్ మీరాజ్ బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసి, మూడు వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. 37.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.