శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘనత: 20 లక్షల మార్క్

హైదరాబాద్ శివారులోని (ఇప్పుడైతే నగరంలో భాగంగా మారిందనుకోండి) శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు దూసుకెళుతోంది. కరోనా తర్వాత మిగిలిన విమానాశ్రాయలతో పోలిస్తే.. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు.. దేశీయంగా కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోంది.

జులై ఒక్క నెలలోనే అంతర్జాతీయ.. దేశీయ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 20 లక్షల మార్కును దాటటం విశేషం. జులైలో విదేశీ ప్రయాణికులు 3.68 లక్షలు కాగా.. 16.4 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో శంషాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే కాదు కర్ణాటక.. మహారాష్ట్రలకు చెందిన వారు సైతం దుబాయ్.. అమెరికా.. ఐరోపా దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ఎంచుకోవటం గమనార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసిన ఐదున్నరేళ్లకే రద్దీ పెరిగింది. కరోనా పుణ్యమా అని తగ్గిన విమాన ప్రయాణాల సంఖ్య అతి తక్కువ వ్యవధిలోనే పుంజుకోవటం విశేషం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 80కు పైగా దేశీయ.. అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఆకర్షించే సత్తా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉందని చెప్పక తప్పదు.