అమెరికాను దున్నేస్తున్న ఇండియన్లు

అగ్రరాజ్యం అమెరికాను ఇండియన్లు దున్నేస్తున్నారు. చదువులు, వ్యాపారాలు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, స్టార్టప్ లు ఇలా ఒకటేమిటి ప్రతిదానిలోను ఇండియన్ల హవా పెరిగిపోతోందట. ఆక్సఫర్డ్ అకడమిక్ రీసెర్చి రిపోర్టు ప్రకారం కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూశాయి. అమెరికా మొత్తం జనాభాలో ఇండియన్లు కేవలం 1 శాతం మాత్రమే. అయితే సిలకాన్ వ్యాలీలోని కంపెనీల వ్యవస్ధాపకుల్లో భారతీయలు 8 శాతం ఉన్నారు. ఇక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్పుల్లో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఇండియనే.

వివిధ రంగాల్లో అమెరికన్ల ఆదాయంకన్నా భారతీయ అమెరికన్ల ఆదాయం చాలా ఎక్కువుంది. అమెరికన్ల ఆదాయంతో పోల్చినపుడు అమెరికాలో స్ధిరపడిన భారతీయుల ఆదాయం 31 శాతం ఎక్కువ. ప్రస్తుతం అమెరికాలోని భారతీయుల సగటు ఆదాయం ఏడాదికి 120 వేల డాలర్లు. అమెరికన్లు 13 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అమెరికాలోని భారతీయుల్లో 6 శాతం మాత్రమే పేదలున్నారు. అలాగే వ్యాపార, పారిశ్రామిక సంస్ధల్లోని కీలక పదవుల్లో భారతీయులే ఎక్కువమంది ఉన్నారు.

అనేక కారణాల వల్ల అమెరికన్లకు ఇండియన్ అమెరికన్లే రోల్ మోడళ్ళుగా నిలుస్తున్నారు. ఇలాంటి అనేక కారణాలతోనే ఇండియన్లంటే అమెరికన్లలో అసూయ పెరిగిపోతోంది. సగటు అమెరికన్ తనకొచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చు చేసేస్తాడు. అదే ఇండియన్లను తీసుకుంటే అత్యధికంగా పొదుపుచేస్తారు. ఈ పొదుపే పెరిగిపెరిగి కొంతకాలానికి చాలా పెద్ద మొత్తమవుతుంది. మొదటినుండి భారతీయ మూలాల్లోనే పొదుపు, జాగ్రత్త అనేదుంది. ఇదే అమెరికన్లలో లోపించింది. అయితే దాన్ని వాళ్ళు అర్ధంచేసుకోవటంలేదట.

ఇదికాకుండా కుటుంబవ్యవస్ధ కూడా ఎదుగుదలలో చాలా కీలకపాత్ర పోషిస్తోందని సర్వేలో తేలింది. భారతీయులు అమెరికాలో చాలా కలిసికట్టుగా ఉంటున్నారు. ఇక కుటుంబసభ్యుల విషయమైతే చెప్పాల్సిన పనేలేదు. ఏ అవసరం వచ్చినా పదిమంది ఒకచోట చేరిపోతారు. అదే అమెరికన్లలో ఈ ఐకమత్యం మచ్చుకి కూడా కనబడదు. పెద్దలను గౌరవించటం, వ్యాపారాలు, పరిశ్రమలను నడపటంలో పెద్దల మార్గదర్శకాలను ఫాలో అవటం, వివాహాలు, కలిసుండటం అనేవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. అదే అమెరికన్లను తీసుకుంటే ఎక్కువమంది వివాహాలు చేసుకోవటం లేదా చేసుకోకుండానే పిల్లల్ని కనటం తర్వాత విడిపోవటం ఎక్కువట. ఇలాంటి అనేక కారణాలతో భారతీయులు అమెరికాను దున్నేస్తున్నారని సర్వేలో తేలింది.