తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు.. సామాన్యులకే కాదు.. అన్ని వర్గాల వారికీ ఇక్కట్లు తెచ్చి పెడుతు న్నాయి. తాజాగా అద్దంలాంటి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మునిగిపోయింది. దీంతో రేపు ఉదయం వరకు కూడా రాకపోకలను నిషేధించడం గమనార్హం. మరోవైపు.. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు ఏపీ పరిధిలో ఉన్న రహదారిపై ఏపీ పోలీసులు.. అటు తెలంగాణ పరిధిలో ఉన్న రహదారిపై ఆ రాష్ట్ర పోలీసులు మోహరించి.. వాహనాలను కంట్రోల్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మునేరుకు వరద పోటెత్తింది. వైరా, కట్టెలేరు, మున్నేరు కు ఒక్క సారిగా వరద పెరిగింది. కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి వద్ద మునేరు వరద 2 లక్షల క్యూసెక్కులు కృష్ణానది లోకి చేరినట్లు అధికారులు తెలిపారు. మునేరు పోటెత్తడంతో నందిగామ మండలం ఐతవరం వద్ద మునేరు వరద జాతీయ రహదారి పై చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలను ఐతవరం వద్ద, విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్ గేట్ వద్ద నిలిపి వేశారు.
14 ఏళ్ల తర్వాత
మునేరు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న నాయకులు, అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, 2004, 2009లోనూ ఇలానే జరిగింది. తర్వాత.. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత కృష్ణానది, మునేరు ఒకేసారి వరద రావటంతో జాతీయ రహదారిని దాదాపు మూసివేశారు.
అప్పట్లో రోడ్డు కోతకు గురి కావటంతో నాలుగు రోజుల పాటు వాహనాలు రాకపోకలు నిలిచి వేశారు. తర్వాత 14 ఏళ్ల కు మునేరు పోటెత్తి వరద ప్రవాహం జాతీయ రహదారిపై ప్రవహించింది. ఖమ్మంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రాంతంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వైరా, కట్టెలేరు, మునేరు కు వరద ప్రవాహం చేరిందని జలవనరుల అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates