ఈ సారి హైద‌రాబాద్‌లో బ‌స్సు కింద త‌ల‌

బ‌స్సు కింద ప‌డి చ‌నిపోతే వ‌చ్చే న‌ష్ట ప‌రిహారంతో త‌న కొడుకు క‌ళాశాల ఫీజు క‌ట్టుకుంటాడ‌ని భావించిన ఓ త‌మిళ‌నాడు మ‌హిళ‌.. క‌దులుతున్న బ‌స్సుకు ఎదురుగా వెళ్లి త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగి వారం కూడా కాక‌ముందే హైద‌రాబాద్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. క‌దులుతున్న ఆర్టీసీ బ‌స్సు వెనుక చ‌క్రాల కింద త‌ల‌పెట్టి చ‌నిపోవాల‌ని ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడు.

ప‌శ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన 40 ఏళ్ల బిసు రాజ‌క్.. త‌న ప‌ది మంది స్నేహితుల‌తో క‌లిసి బ‌తుకుదెరువు కోసం ఈ నెల 22 (శ‌నివారం)న హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇందులో ఆరుగురు న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. బిసురాజ‌క్‌, మ‌రో ముగ్గురు క‌లిసి కొండాపూర్ చేరుకున్నారు. భ‌వ‌న నిర్మాణ కూలీలుగా ప‌ని చేయాల‌నుకున్నారు. సాయంత్రం కొండాపూర్ 8వ పోలీసు బెటాలియ‌న్ రోడ్డులో ఓ దుకాణంలో చెప్పులు కోనేందుకు న‌డుచుకుంటూ వెళ్తున్నారు.

కానీ ఉన్న‌ట్లుండి బిసు రాజ‌క్ ప‌రుగెత్తుకు వెళ్లి అటుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సు వెనుక చక్రాల కింద‌కు దూరాడు. అది గ‌మ‌నించి డ్రైవ‌ర్ బ‌స్సు ఆపాడు. అప్ప‌టికే టైరు కొంచెం అత‌ని మీద‌కు ఎక్కింది. వెంట‌నే స్థానికులు బ‌య‌ట‌కు లాగి గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ అత‌ను మ‌ర‌ణించాడు. అత‌ని మృతికి కుటుంబ స‌మ‌స్య‌లే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. అత‌ను బ‌స్సు కింద ప‌డ్డ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి.