ఏపీలో ఐటీ నగరంగా భాసిల్లాలని కోరుకుంటున్న విశాఖపట్నంపై నీలినీడలు కమ్ముకున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం దీనిని పాలనా రాజధాని చేస్తామని చెబుతోంది. అంటే.. ఒకరకంగా.. ఇటు ఐటీ, అటు పాలన రాజధాని పేరిట విశాఖ వెలుగులు మరింత విరాజిల్లాలి. కానీ, నగరం సహా జిల్లాపై అనేక నీలినీడలుకమ్ముకున్నాయి. కొన్నాళ్ల కిందట అధికార పార్టీ నాయకులపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. సరే.. ఇవి ఎలా ఉన్నా.. ఇటీవల జరిగిన ఎంపీ కుటుంబం కిడ్నాప్, రెండు రోజుల కిందట ఓ పోలీసు అధికారి(ఆర్ ఐ స్వర్ణలత) జరిపిన దందా వ్యవహారం నగరంపై విమర్శలు పెల్లుబికేలా చేసింది.
ఇవన్నీ ఇలా ఉంటే, తాజాగా నేవీ ఉద్యోగి చిన్నారిపై జరిగిన అత్యాచారం, అనంతరం లైంగిక వేధింపులు నగర ప్రతిష్ఠను మరింత మసకబారేలా చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ నగరంలో ఇంత ఘోరాలు చోటు చేసుకోలేదని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ముక్కుపచ్చలారని చిన్నారిని స్కూల్ అటెండర్ అత్యాచారం చేయడం.. దానిని వీడియో తీసి స్నేహితులకు షేర్ చేయడం..వారు కూడా పిల్లను బెదిరించి లైంగికంగా ఇబ్బందులు పెట్టడం వంటివి సంచలనంగా మారాయి.
ఏం జరిగిందంటే..
విశాఖలోని 104 ఏరియాకు చెందిన సత్యరావు ఓ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్కూల్‌లో చదువుతున్న నేవీ ఉద్యోగి చిన్నారిపై అతని కన్ను పడింది. ఆ చిన్నారి కుటుంబం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఇతడూ నివాసం ఉంటున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి మొబైల్‌లో వీడియో తీసి ఆ దృశ్యాలను తన మిత్రులకు పంపాడు. వారు కూడా బాలికను బెదిరించి గత నెల 3వ తేదీ నుంచి 23 తేదీ వరకు పలుమార్లు లైంగికంగా బాలికను వేధించి చిత్ర హింసలకు గురి చేశారు.
బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సత్యారావును అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలికి విశాఖ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. సత్యారావు పనిచేసే స్కూల్‌లోనే బాలిక చదువుతుండటం, తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే బాధిత బాలిక ఉండటంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టేందుకు అవకాశం చిక్కిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనతో విశాఖ ఉలిక్కి పడింది. ప్రశాంత నగరానికి ఇదేం ఖర్మ అంటూ ప్రజలు తల పట్టుకుంటున్నారు.