ఆ దేశ ప్రధానికి ట్రీట్ మెంట్ ఇచ్చిన నర్సుల కామెంట్స్ విన్నారా?

ఒకప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న గ్రేట్ బ్రిటన్ తన హవాను ఎంతలా నడిపిందో తెలిసిందే. అలాంటి ఆ దేశానికి ఇప్పటివరకూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా చివరకు ఆ దేశ ప్రధాని సైతం దాని బారిన పడటాన్ని మర్చిపోలేం. తొలుత ఇంట్లోనే వైద్య సాయాన్ని అందుకున్న ఆయన.. తర్వాతి కాలంలో పరిస్థితి విషమిస్తున్న వైనాన్ని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఒక సంపన్న దేశ ప్రధానిని కరోనా కారణంగా ఆసుపత్రికి తరలించటం బ్రిటన్ ప్రధానితోనే షురూ అయ్యిందని చెప్పాలి. కొద్దిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రిటన్ ప్రధాని గురించి ఆయనకు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇచ్చిన ఇద్దరు నర్సులు తమకు ఎదురైన అనుభవాల్ని వెల్లడించారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు సేవలు అందించిన ఇద్దరు నర్సుల్లో ఒకరు పోర్చుగల్ దేశానికి చెందిన మహిళ అయితే.. మరొకరు న్యూజిలాండ్ కు చెందిన వారు. సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. దేశ ప్రధానికి సేవ చేసే వేళ.. తనకు ఎదురైన అనుభవాల్సి ఆమె వెల్లడించారు. ప్రధానమంత్రికి సేవలు అందించటానికి తనను ఎంపిక చేసిన విషయాన్ని తెలుసుకున్నంతనే తనకెంతో భయమేసిందని నర్సు లూయి పీతర్మ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు తాను ప్రధానికి సేవలు అందించినట్లుగా చెప్పారు

ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను బోరిస్ అని పిలవాలని ప్రధాని తనకు స్వయంగా సూచించారని నర్సు లాయి పేర్కొన్నారు. ఆయనకు దగ్గరుండి సేవలు అందించటం మాత్రం గర్వంగా ఉందన్నారు.

మరో నర్సు జెన్నీ మెక్ జీ సైతం తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. ప్రధానికి సేవలు అందించటాన్ని మర్చిపోలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో తనకు సాయం చేసిన నర్సుల గురించి ప్రధాని బోరిస్ సైతం స్పందించారు. తనను చక్కగా చూసుకున్నట్లుగా ఆయన చెప్పారు. ఇద్దరునర్సులు తనను చాలాబాగా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు.