ఒక పెద్ద ప్రమాదం, దాంతో పాటే విషాదం చోటు చేసుకున్నపుడు మానవత్వంతో స్పందించే వాళ్లు ఒకవైపు ఉంటే.. ఆ సమయంలోనూ దుర్మార్గంగా ఆలోచించి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లు ఇంకోవైపు ఉంటారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటనదగ్గది ఇటీవల ఒడిషాలో చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఒకదాంతో ఒకటి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో దాదాపు మూడొందల మందిదాకా ప్రాణాలు కోల్పోయారు.
వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఐతే ఈ ప్రమాదం జరిగిన అనంతరం చుట్టు పక్కల వాళ్లు ఎంతోమంది స్వచ్ఛందంగా తరలి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రక్తదానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు. కానీ అదే సమయంలో ప్రమాద బాధితుల నుంచి దొరికిందంతా దోచుకోవడానికి చూశారు కొందరు దుర్మార్గులు. ఈ ప్రమాదం తర్వాత ఇంకో రకం కేటుగాళ్లు తయారై ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందడానికి చూస్తుండటం గమనార్హం.
రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.12 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా చనిపోయిన వారిలో పలువురి మృతదేహాలను ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేదు. అవి గుర్తు తెలియని మృతదేహాల్లాగానే ఉన్నాయి ఇప్పటిదాకా. ఐతే ప్రభుత్వ పరిహారం గురించి తెలుసుకున్న కొందరు.. ఈ గుర్తు తెలియని మృతదేహాలను తమవిగా చెప్పి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
కటక్‌కు చెందిన గీతాంజలి అనే మహిళ.. బాలేశ్వర్‌లో రైలు ప్రమాద మృతుల ఫొటోలు పెట్టిన చోటికి వచ్చి.. తన భర్త ఈ ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పింది. ఐతే పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. గట్టిగా అడిగితే అసలు విషయం వెల్లడైంది. ఆమె భర్త బతికే ఉన్నాడు. పరిహారం కోసమే ఆమె డ్రామా ఆడినట్లు తేలింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులు మరికొన్ని రావడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి.