ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో…ఇప్పుడు అందరి చూపు వ్యాక్సిన్‌పైనే. ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు తీసుకువస్తున్నాయనే ప్రచారం ఎందరిలోనో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్పర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు నిర్వహిస్తోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. దీని పనితీరును పరిశీలించడంలో భాగంగా జరుగుతున్న పరిశోధనల్లో రెండో, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ చేసుకోవచ్చంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.225కే కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సాగిస్తున్న ఈ పరిశోధనలకు సంబంధించి యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా… బ్రెజిల్లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యాక్సిన్ ను రూ.225కే అందిస్తున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఈ వ్యాక్సిన్ ను 92 దేశాలకు అందించేందుకు సుమారు 100 మిలియన్ల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ తీపికబురు ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించనున్న సంగతి తెలిసిందే.