భార్య శృంగారంలో పాల్గొన‌నంటే.. కేసులు పెట్టొచ్చు

భార్యా భ‌ర్త‌ల శృంగారానికి సంబంధించి చ‌రిత్రాత్మ‌క అల‌హాబాద్‌ న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. భార్యాభర్తల దాంపత్య జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని న్యాయస్థానం తెలిపింది. ముఖ్యంగా భ‌ర్త‌కు భార్య స‌హ‌క‌రించాల‌ని.. అలా చేయ‌క‌పోతే.. క్రూర‌త్వం కింద కేసులు న‌మోదు చేయొచ్చ‌ని తేల్చి చెప్పింది.

తగిన కారణంగా లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల పిటిషన్ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేసింది.

రవీంద్ర యాదవ్.. తనకు 1979లో వివాహమైందని.. పెళ్లయిన కొంత కాలం తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని అప్పీలులో పేర్కొన్నారు. అలాగే తన భార్య తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందని తెలిపారు. ఒకే ఇంట్లో ఉంటున్నా తనతో లైంగిక సంబంధానికి దూరంగా ఉందని ఆయన అప్పీల్లో పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత తన భార్య.. పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు.

తన భార్యను ఇంటికి రమ్మని పిలిచినా ఆమె రాలేదని అన్నారు. ఆ తర్వాత 1994లో గ్రామ పంచాయతీ లో రూ.22 వేలు భరణం చెల్లించి పరస్పరం విడిపోయామని వెల్లడించారు. అనంతరం అప్పీలుదారుడి భార్య మరో వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో లీగల్గా విడాకులు పొందేందుకు సిద్ధమయ్యాడు రవీంద్ర యాదవ్. మానసిక క్రూరత్వం, తనను విడిచిపెట్టి ఉండటాన్ని కారణాలుగా చూపుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

అయితే క్రూరత్వం కారణంగా విడాకులు ఇచ్చేందుకు వారణాసి ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. ఆయన విడాకుల అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో అలహాబాద్ హైకోర్టులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేశారు రవీంద్ర యాదవ్. ఈ అప్పీల్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు చాలా కాలం పాటు విడివిడిగా జీవిస్తున్నారని పేర్కొంది. ‘భార్యకు దాంపత్య బంధం మీద గౌరవం లేదు. ఆమె తన భర్తకు భార్యగా ఉండేందుకు సుముఖంగా లేదు. అందుకే వారి దాంపత్య జీవితం విచ్ఛిన్నమైంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేప‌థ్యంలో క్రూర‌త్వం కింద కేసులు న‌మోదు చేయొచ్చు న‌ని వ్యాఖ్యానించింది.