ఇండియా-పాకిస్థాన్ మెగా ఫైట్ ఆ రోజే..

ప్ర‌పంచ క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా ఇది క్రేజీయెస్ట్ క్రికెట్ మ్యాచ్‌గా ఉంటోంది. అందులోనూ రెండు దేశాల మ‌ధ్య ద‌శాబ్దంన్న‌ర‌గా ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోవ‌డంతో.. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డితే క్రికెట్ ప్ర‌పంచ‌మంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తోంది.

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల‌నే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ ప‌ట్ల ఆసక్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆ మ్యాచ్ అంటే టీవీల ముందు కూల‌బ‌డిపోతారు. గ‌త ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌ల‌ప‌డ్డాక రెండు జ‌ట్ల మ్యాచ్ మ‌రొక‌టి రాలేదు. ఈ ఏడాది ఆసియా క‌ప్ టోర్నీ మీద సందిగ్ధ‌త కొన‌సాగుతుండ‌గా.. ఆ తర్వాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం రెండు జ‌ట్ల మ్యాచ్ మీద ఒక క్లారిటీ వ‌చ్చేసింది. అక్టోబ‌రు 15న ఈ మెగా మ్యాచ్ జ‌ర‌గ‌బోతోంది.


అక్టోబ‌రు మొద‌టి వారంలో ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లు కానుండ‌గా.. ఒకే గ్రూప్‌ల ఉన్న భార‌త్, పాకిస్థాన్ 15న ముఖాముఖి త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఈ మ్యాచ్ ఏ స్టేడియంలో జ‌రుగుతుంద‌నే విష‌యంలో క్లారిటీ లేదు. ఏదైనా పెద్ద సిటీలో ప్ర‌ముఖ స్టేడియంలోనే మ్యాచ్ ఉండ‌బోతోంది. ఇక ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ వేదిక కూడా ఖ‌రారైపోయింది. పున‌ర్నిర్మాణం త‌ర్వాత‌ ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవ‌త‌రించిన అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం ఫైన‌ల్‌కు వేదిక‌గా నిల‌వ‌నుంది.

టోర్నీలో మ‌రికొన్ని మ్యాచ్‌ల‌కు కూడా ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వ‌బోతోంది. చివ‌ర‌గా 2011లో సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ విజేత‌గా నిలిచింది. మ‌ళ్లీ భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మెగా టోర్నీలో మ‌రోసారి టైటిల్ గెలుస్తుంద‌ని అభిమానులు భారీ అంచ‌నాల‌తో ఉన్నారు.