హైదరాబాద్ మాల్ ప్లే జోన్ లో చిన్నారి చేతి వేళ్లు తెగిపడ్డాయి

అనూహ్య ప్రమాదం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. వీకెండ్ వేళ సరదాగా చిన్నారిని తీసుకెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. సిటీలోని మాల్ ఏదైనా.. ఒక ఫ్లోర్ లో కచ్ఛితంగా ఏర్పాటు చేసేది ప్లే జోన్. మాల్ కు వచ్చే పిల్లలకు ఈ జోన్ కు వెళ్లేందుకు.. అక్కడ గడిపేందుకు తల్లిదండ్రుల్ని ఎంతలా సతాయిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి ప్లే జోన్ లో ఇలాంటి ప్రమాదం కూడా జరుగుతుందా? అన్న షాక్ కు గురయ్యే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 1లో ఉన్న సిటీ సెంట్రల్ మాల్ గురించి తెలిసిందే. ఇందులో ఉన్న ప్లేజోన్ కు వెళ్లారు బంజారాహిల్స్ లోని ఇబ్రహీం నగర్ కు చెందిన మెహతా జహాన్.. మహియా బేగం తమ పాప మూడేళ్ల మెహ్విష్ లుబ్నాను తీసుకొని వెళ్లారు. సిటీ సెంట్రల్ మాల్ లోని నాలుగో అంతస్తులో ఉన్న ప్లే జోన్ కు వెళ్లారు. అక్కడి ఒక మెషిన్ లో చిన్నారి వేళ్లుపడి 3 చేతి వేళ్లు.. చూపుడు వేలు కొంత భాగం నలిగిపోయింది. దీంతో తల్లి తనచిన్నారిని హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించారు.

చిన్నారి కుడి చేతి మూడువేళ్లను వైద్యులు పూర్తిగా తొలగించారు. చేతి వేళ్లు బాగా నలిగిపోయాయని.. వాటిని తిరిగి అతికించటం సాధ్యం కాదని చెప్పటంతో ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతాకాదన్నట్లుగా మారింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాల్ నిర్వాహకులు.. స్మాష్ జోన్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆడుకుంటున్న పిల్లల్నిచూసేందుకు సిబ్బంది అందుబాటులోకి రాలేదని వాపోయారు.

ఇదిలా ఉంటే సీసీ పుటేజీ కోసం నిర్వాహకుల్ని సంప్రదించిన వేళ.. వారు అక్కడున్న సీసీ కెమేరానుతొలగించటం గమనార్హం. ఆ ప్రాంతంలో పుటేజీ లేదని చెప్పారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సిటీ సెంట్రల్ మాల్ మేనేజ్ మెంట్ మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.