ప్రపంచ టెక్ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఇంజనీర్ ఒకరు.. ఎన్ వైసీలోని ఆఫీసు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి చెల్సియాలోని సెర్చ్ జెయింట్ హెడ్‌క్వార్టర్స్‌లోని 14వ అంతస్తు నుంచి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దూకి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గూగుల్ మాన్‌హాటన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ విషాదం ఇంకా ఉద్యోగి కుటుంబ సభ్యులకు తెలియలేదని సమాచారం.
మరోవైపు.. ఉద్యోగిని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్సియాలోని వెస్ట్ 15వ వీధిలోని 15 అంతస్తుల ఆర్ట్ డెకో భవనానికి ఎదురుగా ఉన్న భవనం సమీపంలో ఒక అపస్మారక వ్యక్తి నేలపై పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అత్యవసర ఫోన్ నెంబర్ 911కు ఫోన్లు వచ్చాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే బెల్లేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయిన ట్లు ప్రకటించారు.
14వ అంతస్తులోని ఓపెన్-ఎయిర్ టెర్రస్ అంచుపై సదరు వ్యక్తి చేతి ముద్రలను పోలీసులు గుర్తించారు. దీంతో అతను అక్కడి నుంచే కిందకి దూకినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి సూసైడ్ నోట్ లేదా వీడియో తమకు లభించలేదని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే, ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించి గూగుల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఈ ఘటన టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల ఒత్తిడిని మరోసారి తెరమీదికి తెస్తుండడం గమనార్హం.
గతంలో కూడా..
గతంలో కూడా గూగుల్ ఉద్యోగి జాకబ్ ప్రాట్ ఆత్మహత్య చేసుకున్నారు. 33 ఏళ్ల ప్రాట్, మాన్‌హాటన్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అతను ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన చెల్సియాలోని వెస్ట్ 26వ స్ట్రీట్ , 6వ అవెన్యూలోని అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ ఘటన కూడా తీ వ్రస్థాయిలో కలకలం రేపింది.