ధోని రిటైర్మెంట్‌పై మ‌ళ్లీ ట్విస్ట్‌

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప క్రికెట‌ర్ల‌లో ఒక‌డు ధోని. దేశంలో స‌చిన్ త‌ర్వాత అత్యంత ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కూడా అత‌నే. ధోని ఎలా ఆడ‌తాడ‌న్న‌ది ప‌క్క‌న పెట్టి కేవ‌లం అత‌ను మైదానంలో ఉంటే చాలు అనుకునే అభిమానులు కోట్ల‌ల్లో ఉంటారు. కేవ‌లం అత‌డి ఉనికినే ఎంజాయ్ చేస్తారు త‌న అభిమానులు. ఐపీఎల్‌లో చెన్నై మ్యాచ్‌లు అన‌గానే స్టేడియాలు జ‌నాల‌తో పోటెత్తుతాయి. ధోని రిటైరైతే క్రికెట్ చూడ్డం మానేస్తాం అనే వాళ్లు కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉంటారు. మ‌రి ధోని ఎప్పుడు ఆట నుంచి పూర్తిగా త‌ప్పుకుంటాడు అనే విష‌యంలో స‌స్పెన్స్ న‌డుస్తోంది.

నాలుగేళ్ల కింద‌టే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరం అయిన ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్‌.. ఐపీఎల్‌లో మాత్రం కొన‌సాగుతున్నాడు. ఫామ్ దెబ్బ‌తిని, ఫిట్నెస్ స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో రెండేళ్ల ముందే ఐపీఎల్‌కు టాటా చెప్పేస్తాడ‌నుకున్నారు. కానీ మ‌ళ్లీ ఫిట్‌గా త‌యారై, ఆట‌ను మెరుగుప‌రుచుకుని ఐపీఎల్‌లో కొన‌సాగుతున్నాడు. పైగా చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ రిటైర‌వ్వాల‌న్న‌ది ధోని కోరిక‌. గ‌త మూడేళ్లు క‌రోనా వ‌ల్ల చెన్నైలో ఐపీఎల్ జ‌ర‌గ‌లేదు. ఈ ఏడాది జ‌రిగింది కాబ‌ట్టి ఇదే ధోనికి చివ‌రి ఐపీఎలేమో అనుకున్నారు.

కోల్‌క‌తాలో మ్యాచ్ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ధోని అభిమానులు హాజ‌ర‌వ‌డంతో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. త‌న‌కు వీడ్కోలు ఇవ్వ‌డానికే వ‌చ్చారేమో అని ధోని అన‌డంతో ఇదే అత‌డి చివ‌రి ఐపీఎల్ అని అంతా ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు. కానీ బుధ‌వారం ల‌క్నోతో చెన్నై మ్యాచ్‌లో మ‌ళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు ధోని.

చివ‌రి సీజ‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నారా అని వ్యాఖ్యాత డానీ మోరిస‌న్ అడిగితే.. ఇదే చివ‌రిద‌ని మీరు డిసైడ్ చేసేశారా అంటూ న‌వ్వేశాడు ధోని. దీనికి బ‌దులుగా మోరిస‌న్‌.. ఐతే అలా ఏమీ కాదు, మ‌ళ్లీ వ‌చ్చే ఏడాది వ‌స్తున్నావ‌న్న‌మాట‌.. అత‌ను వ‌చ్చే ఏడాది కూడా ఐపీఎల్‌కు వ‌స్తున్నాడు అంటూ అభిమానుల క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య ప్ర‌క‌టించాడు. ఐతే ధోని మ‌న‌సులో ఏముంద‌న్న‌ది చెప్ప‌లేం. ఇలా అన్నాడు కాబ‌ట్టి వ‌చ్చే ఏడాది కూడా ఐపీఎల్‌కు వ‌స్తాడా.. లేక సీజ‌న్ చివ‌ర్లో స‌డెన్‌కు ఆటకు టాటా చెప్పేస్తాడా అన్న‌ది చూడాలి.