స‌హ‌జీవ‌నం రిజిస్ట్రేష‌నా..? నాన్సెన్స్‌!!

దేశంలో వివాహం చేసుకోకుండా ఒక స్త్రీ, ఒక పురుషుడు క‌లిసి జీవించ‌డాన్ని చ‌ట్ట బ‌ద్ధం చేసిన విష‌యం తెలిసిందే. దీనినే స‌హ‌జీవ‌నం అంటూ.. సుప్రీం కోర్టు కూడా గ‌తంలో స‌మ‌ర్థించింది. అయితే.. ఇలాంటి స‌హ‌జీవ‌నం చేసే దంప‌తుల వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని, వీరికి కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని.. స‌హ‌జీవ‌నాన్ని రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని కోర‌డంపై మాత్రం నిప్పులు చెరిగింది. “స‌హ‌జీవ‌న్ రిజిస్ట్రేష‌న్‌..? నాన్సెన్స్‌” అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

అదేవిధంగా.. సహజీవనాల రిజిస్ట్రేషన్కు నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరడాన్ని మూర్ఖపు ఆలోచనగా అభివర్ణించింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణకు నిరాకరించింది. ఈ పిటిష‌న్‌ను నాన్సెన్స్‌గా అబివ‌ర్ణించింది. సహజీవనం రిజిస్ట్రేషన్కు నిబంధనలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశాలించాలంటూ న్యాయవాది మమతా రాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ వ్యాజ్యంపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది ఒక మూర్ఖపు ఆలోచన అని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ‘సహజీవనం రిజిస్ట్రేషన్కు, కేంద్రానికి సంబంధం ఏంటి? ఇదొక మూర్ఖపు ఆలోచన. ఈ రకమైన వ్యాజ్యాలు దాఖలు చేసే పిటిషనర్‌లను కోర్టు ఖర్చులు చెల్లించమనే సమయం ఆసన్నమైంది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాం.’ అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

అస‌లు ఈ పిటిష‌న్ ఎందుకంటే?

గతేడాది ఢిల్లీకి చెందిన యువతి శ్రద్ధావాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె శ‌రీర‌భాగాల‌ను వేర్వేరు చోట్ల విసిరేశాడు. అయితే.. సహజీవనం రిజిస్ట్రేషన్ వల్ల ఇలాంటి వారి విష‌యంలో భాగస్వాముల గురించి ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉంటుంది. అలాగే సహజీవనంలో ఉన్నవారికి నేర చరిత్ర ఉంటే అది కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది.. అనేది న్యాయ‌వాది మ‌మతా రాణి ఉద్దేశం.