కిమ్. ఈ రెండు అక్షరాలకు.. ఈ పేరుకు ఇటీవల కాలంలో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉత్తర కొరియాను అప్రతిహతంగా పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అక్కడి ప్రజల విషయంలోనేకాదు.. నాయకులు.. రాజకీయంగా కూడా నియంతృత్వ ధోరణితోనే ముందు కు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కిమ్ పాలిత ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. అంతేకాదు.. ప్రపంచానికి.. ఉత్తర కొరియాకు మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పాలి.
ఏదో చైనా వంటి ఒకటి రెండు దేశాలతోనే ఉత్తర కొరియా టచ్‌లో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా కిమ్ తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారని తెలిసింది. వాస్తవానికి ఉత్తరకొరియా ప్రజలు బయటి ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకొని చైతన్యం పొందుతారేమోనని, దాని వల్ల తన కుటుంబ పాలనకు ఆటంకం కలుగుతుందేమోనని కిమ్ అనుక్షణం భయపడుతుంటాడు.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా చేశారు. విధుల నిమిత్తం కావాలన్నా.. వాటి వరకే పరిమితం కావాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. తలలే ఎగిరిపోతాయ్!! తన ప్రత్యర్థి దేశాలకు చెందిన మ్యూజిక్, సిరీస్‌లను దేశంలోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. వాటిని చూసి పిల్లలు దొరికితే.. ఆరు నెలల పాటు తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలిస్తారు. పిల్లలని చూడకుండా ఐదేళ్ల శిక్ష విధిస్తున్నారు.
మరి ఇంత కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఓ అధికారి సాహసం చేశాడు. ప్రజల కమ్యూనికేషన్ వ్యవహారాలు చూస్తున్న బ్యూరోలో పనిచేస్తున్న గూఢచారికి తన బాధ్యతల దృష్ట్యా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి లభించింది. దీంతో సదరు గూఢచారి.. అసలు పని మానేసి.. కిమ్ గురించి తెలిసినా.. ఆయన వ్యక్తిగత వివరాలు వెతికే ధైర్యం చేశాడు. ఈ విషయం తెలిసిన.. కిమ్.. వెంటనే ఆయనకు మరణ శిక్ష విధించారు. ఇదే విషయానికి సంబంధించి మరికొందరు ఉన్నతాధికారులను విధుల నుంచి బహిష్కరించారు. ఇదీ.. కిమ్ పరిస్థితి!