భారత క్రికెట్ జట్టును కొన్ని రోజుల నుంచి ఒక టెన్షన్ వెంటాడుతోంది. ఒక దశలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో బాగా వెనుకబడ్డట్లు కనిపించిన టీమ్ ఇండియా.. వరుస విజయాలతో పట్టికలో పైపైకి ఎగబాకింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు దక్కడం లాంఛనం లాగే కనిపించింది. కానీ మూడో టెస్టులో కంగారూల చేతిలో అనూహ్యంగా ఓడడంతో సమీకరణాలు మారిపోయాయి.
న్యూజిలాండ్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సిన శ్రీలంక.. అందులో 2-0తో గెలిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో భారత్ గెలవకపోతే ఫైనల్ బెర్తు దూరం అయ్యే పరిస్థితి తలెత్తింది. అహ్మదాబాద్‌లో చివరి టెస్టు తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించగా.. అదే సమయంలో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక ఆధిపత్యం కనిపించింది. దీంతో భారత్‌కు టెన్షన్ తప్పలేదు.
కానీ కింగ్ కోహ్లి సరైన సమయంలో ఫామ్ అందుకున్నాడు. 186 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో జట్టును ప్రమాదం నుంచి బయటపడేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడేందుకు ఆస్కారమే లేకుండా చేశాడు. మరోవైపు శ్రీలంక-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్‌కు లంక 285 పరుగుల ప్రమాదకర లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆటలో చివరి రోజైన సోమవారం కివీస్ గొప్పగా పోరాడి 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. లంక తొలి టెస్టులో ఓడిపోవడంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా టెన్షన్ తీరిపోయింది.
ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు వెనుకబడ్డ ఆస్ట్రేలియా.. సోమవారం మధ్యాహ్నానికి వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా ఆలౌటై.. భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించడం.. జరిగే పని కాదు కాబట్టి మ్యాచ్ డ్రానే. 2-1తో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోనుంది.