ఏపీలో 5జీ.. ఏయే న‌గ‌రాల్లోనంటే!!

ఏపీలో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ప్రారంభించారు. మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ‘జియో ట్రూ 5జీ’-‘ జియో ట్రూ 5జీ ప‌వ‌ర్డ్ వై-ఫై’ సేవ‌ల‌ను ఆవిష్క‌రించారు.

మంత్రి అమ‌ర్‌నాథ్ మాట్లాడుతూ , “ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్రూ 5 జికి ఇప్ప‌టికే ఉన్న‌ పెట్టుబడి రూ .26,000 కోట్లతో పాటు, అదనంగా జియో రూ .6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది మన రాష్ట్ర అభివృద్ధి పట్ల వారి అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. 2023 డిసెంబర్ నాటికి ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి” అని చెప్పారు.

కాగా, జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో రాష్ట్రంలో ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని తెలిపింది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని స‌ర్కారు తెలిపింది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించ‌నుంది.