సలార్.. లైన్లోనే ఉన్నాడు

ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ‘సలార్’ మీదే ఉన్నాయి. ‘బాహుబలి’ లాంటి మెగా సక్సెస్ తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ తర్వాతి చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లవ్వగా.. ‘ఆదిపురుష్’ మీద ఆశలు దాదాపుగా నీరుగారిపోయినట్లే కనిపిస్తోంది.

టీజర్ రిలీజ్ తర్వాత విపరీతమైన నెగెటివిటీని తట్టుకోలేక సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ మీద భారీ ఆశలు, అంచనాలతో ఉన్నారు అభిమానులు.

ప్రభాస్ కటౌట్‌కి తగ్గట్లు ప్రశాంత్ ఓ మోస్తరు సినిమా ఇచ్చినా.. బాక్సాఫీస్ షేక్ అయిపోతుందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజైన ప్రతి ప్రోమో, ఆన్ లొకేషన్ లీక్డ్ పిక్స్ అభిమానుల్లో అంచనాలను పెంచాయి. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

ఐతే ఈ సినిమా ఈసారి ట్రాక్ తప్పట్లేదని.. రిలీజ్ దిశగా లైన్లోనే ఉందని నిర్మాణ సంస్థ ‘హోంబలె ఫిలిమ్స్’ అధినేత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ‘సలార్’ చిత్రీకరణ మీద కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయినట్లు విజయ్ వెల్లడించాడు. అంతే కాక సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా అద్భుతంగా వస్తోందని.. వచ్చే ఏడాది అనుకున్న సమయానికే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేశాడు.

2023 ఏప్రిల్ 28కే రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని.. షూటింగ్ ఆలస్యం వల్ల సెప్టెంబరు 28కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’ను జూన్‌కు అనుకుంటున్నప్పటికీ అప్పుడు కూడా పక్కా అని చెప్పే పరిస్థితి లేదు. ‘సలార్’ అయితే ఇంకో డేట్ మార్చుకునే సూచనలు కనిపించడం లేదు. అనుకున్నట్లే సెప్టెంబరు నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా. ఇదిలా ఉండగా ‘సలార్’కు సీక్వెల్ కూడా దాదాపు కన్ఫమ్ అయినట్లే కనిపిస్తోంది.