ఏపీలో ‘సెక్స్‌’ రికార్డ్ మ‌హారాష్ట్ర‌ను దాటేసి ముందుకు

సెక్స్ వ‌ర్క‌ర్స్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిల‌యంగా మారిందా? ఇక్కడ సెక్స్‌ను అమ్ముతున్న‌వారు ఎక్కువ‌గా ఉన్నారా? అంటే.. సాక్షాత్తూ కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఔన‌ని చెబుతోంది. ప‌డుపువృత్తి చేసుకుంటూ జీవించే సెక్సు కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది. అంతే కాదు.. ఇక్క‌డ నుంచి ఇత‌ర‌ రాష్ట్రాల‌కు వెళ్లి సెక్స్ వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య‌లోనూ ఏపీ ముందు వ‌రుసలోనే ఉంద‌ని తెలిపింది.

ఒక‌ప్పుడు ఈ రెండు విష‌యాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో ఉండ‌గా.. ఇప్పుడు ఈ స్థానాన్ని ఏపీ కైవ‌సం చేసుకుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. సెక్స్ వ‌ర్క‌ర్స్ విష‌యంలో ఏపీ అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటుకు తెలిపింది. హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, స్థానిక సెక్సు కార్మికులు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు.

కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్షమంది ఈ పని ద్వారా కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇక.. సెక్సు కార్మికులు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా హెచ్చరించింది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన సెక్సు కార్మికులు క‌నిపిస్తున్న‌ట్టు ఈ సంస్థ పేర్కొంది. ఇక, లెక్కలోకి రాకుండా మరికొన్ని వేలమంది ఉండి ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డింది.