ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. ప్రజల మధ్య ఉండడం లేదని.. ఎన్ని సార్టు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. గతంలో నియోజకవర్గాలపై తెప్పించు కున్న నివేదికల ఆధారంగా.. దాదాపు 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారు తమ పంథాను మార్చుకోవాలని సీఎం జగన్ హెచ్చరించారు. దీంతో 151మందిలో 27 మాత్రమేగా అనే చర్చ వచ్చింది.
అయితే, ఇప్పుడు ఈ సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది కూడా ప్రజల మధ్య ఉండడం లేదేని.. తాను చెప్పిన గడపగడప కార్యక్రమాన్ని అసలు పట్టించుకోవడం లేదని తాజాగా సీఎం జగన్ పేర్కొన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండడం, వారిని కూడా సాధారణ ఎమ్మెల్యేల మాదిరిగానే సీఎం జగన్ హెచ్చరించడం వంటివి పార్టీలో చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం చెబుతున్న 32 మంది లెక్క కూడా వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇదిలావుంటే, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటినీ మూడు సార్లయినా తట్టా లనేది సీఎం జగన్ లెక్క. బాగానే ఉంది. కొందరు ఈ పనికూడా చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆయన సమీక్షించి.. సమస్యలను పట్టించుకుని ఊరట చెందేలా వ్యవహరించకపోవడమే అసలు సమస్య గా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చాలా నియోజకవర్గాల్లో ప్రజలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై నిలదీస్తున్నారు.
రోడ్లు బాగాలేదని, మురికినీటి వ్యవస్థ బాగాలేదని చెబుతున్నారు. మరి కనీసంలో కనీసం వీటిని చేయించే విధంగా అయినా.. తమకు నిధులు ఇవ్వాలన్న ఎమ్మల్యే మాటలను సీఎంజగన్ ఆలకించడం లేదని పార్టీలో నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లాలంటేనే సొంత ఖర్చులు పెట్టుకుని కార్యకర్తలను తీసుకువెళ్లి.. వస్తున్నామని, ఇక సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలంటే తమ వల్ల కాదని చెబుతున్నారు. అంటే, మొత్తంగా ఎమ్మెల్యేలు తిరగలేక పోవడానికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుండడానికి ప్రత్యక్షంగా అయినా.. పరోక్షంగా అయినా.. ప్రభుత్వం కాదా? అనే చర్చ పార్టీలోనే జరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates