రైలుకు-ప్లాట్ ఫామ్‌కు మ‌ధ్య‌ న‌ర‌కం చూసిన అమ్మాయి ఇక లేదు

రైలుకు-ప్లాట్ ఫామ్‌కు మ‌ధ్య చిక్కుకుని..జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య ఎదుర్కొన్న వైద్య విద్యార్థిని ఇక‌లేదు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నాలు చేసినా.. ఘ‌ట‌న‌తో భీతిల్లిన ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అనంతరం.. ఆసుప‌త్రిలోనే తుదిశ్వాస విడిచింది. దీంతో ఈ ఘ‌ట‌న అంద‌రినీ క‌లిచి వేసింది.

విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం రైలు దిగబోతూ ఓ విద్యార్థిని కాలు జారడంతో ప్లాట్ ఫారానికి, రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘ‌ట‌న తెలిసిందే. సుమారుగా రెండు గంట‌ల పాటు న‌ర‌కం అనుభవించింది. అనంత‌రం ఆసుప‌త్రికి చేరుకుని కోమాలోకి వెళ్లిపోయి.. కొద్ది సేప‌టి కింద‌ట తుదిశ్వాస విడిచింది.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నానికి చెందిన మెరపాల శశికళ (20) దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రోజూ అన్నవరం నుంచి రైలులో వచ్చి వెళుతున్నారు. ఆ విధంగానే బుధవారం కూడా అన్నవరంలో గుంటూరు-రాయగడ పాసింజర్ ఎక్కారు.

బుధ‌వారం ఉదయం రైలు దువ్వాడ చేరుకుంది. శశికళ రైలు నుంచి దిగుతుండగా కాలు జారి ప్లాట్ఫారానికి, రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. దీనిని గమనించి తోటి ప్రయాణికులు కేకలు వేయడంతో పాటు వెంట‌నే ట్రైన్‌కు ఉన్న చైన్ లాగారు. దీంతో రైలు ఆగిపోయింది. వెంట‌నే స్పందించిన‌ రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్లాట్ఫారంలోని రెండు బ్లాకులను విరగ్గొట్టి, గంటన్నర తరువాత ఆమెను పైకి తీశారు.

వెంటనే అంబులెన్స్‌లో కిమ్స్, ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమె భయంతో బాగా ఆందోళన చెందిందని, వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి విషమం గానే వుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో అంద‌రూ ఆమె కోలుకోవాల‌ని.. ఆరోగ్యంతో తిరిగి కాలేజీ బాట‌ప‌ట్టాల‌ని కోరుకున్నారు. కానీ ఘ‌ట‌న త‌ర్వాత కోమాలోకి వెళ్లిపోయిన శ‌శిక‌ళ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచింది.