భార్య‌ రేప్ వీడియో చూసి.. భ‌ర్త‌ అత్మహత్య!

వివాహితపై అత్యాచారం చేసి వీడియో తీశాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ వీడియోను భర్తకు పంపించగా.. మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర జల్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళపై ఒక పెట్టుబ‌డి దారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అంతా ఫోన్లో రికార్డు చేశాడు. తర్వాత దానిని ఆమె భ‌ర్త‌కు పంపించాడు. దీనిని చూసిన భర్త.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహిత తన భ‌ర్త‌తో క‌లిసి జ‌ల్నా జిల్లాలోని పింపల్గామ్ అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమె భ‌ర్త చిరు వ్యాపారి. ఈ క్ర‌మంలో ఇంటి వ‌ద్ద ఉండే ఆమెకు చుట్టు ప‌క్క‌ల ఉండే కొంత మంది మ‌హిళ‌లు ప‌రిచ‌యం అయ్యారు. ఈ క్ర‌మంలో ఓ రోజు వ్యాపారానికి పెట్టుబ‌డి పెట్టేందుకు ర‌వి ద‌త్తాత్రేయ అనే వ్య‌క్తి రెడీగా ఉన్నార‌ని, నువ్వు మాట్లాడితే ఆయ‌న డబ్బులు ఇస్తాడ‌ని, మీ వ్యాపారం బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివాహిత.. ఈ మ‌హిళ‌లు చెప్పిన‌ట్టుగానే ర‌వి ద‌త్తాత్రేయ అనే వ్య‌క్తికి ఫోన్ చేసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఓ ఇద్ద‌రు అనుచ‌రుల‌ను తీసుకుని ఆమె ఇంటికి వ‌చ్చాడు. అనంతరం.. రవి దత్తాత్రేయ వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాధితురాలితో మాట్లాడిన అసభ్యకర ఫోన్ సంభాషణ రికార్డింగులను, వీడియోలను ఆమె భర్తకు పంపించాడు.

దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో తన పరువు పోతుందని విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవ‌రిని బ‌డితే వారిని న‌మ్మవ‌ద్ద‌ని పోలీసులు ప్ర‌క‌టించ‌డం కొస‌మెరుపు. కాగా, ఈ దంప‌తుల‌కు పెళ్లై రెండు సంవ‌త్స‌రాలే కావ‌డం గ‌మ‌నార్హం.